Sri Sitaramula Kalyanam | రాయపోల్, ఏప్రిల్ 07 : రాయపోల్ మండల కేంద్రంలోని హనుమాన్ దేవాలయ ఆవరణలో శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ఆదివారం రాత్రి పురోహితులు, భక్తుల జయ జయ ధ్వనుల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు. రాత్రి 8 గంటలకు స్వామివారి ఎదుర్కోలు అనంతరం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పెళ్లి పందిరిలో సీతారాముల కళ్యాణం ఎంతో వైభవంగా నిర్వహించారు.
ప్రతి సంవత్సరం శ్రీరామనవమి సందర్భంగా ఇక్కడ 110 మంది దంపతులతో కళ్యాణం నిర్వహించడం ఆనవాయితీగా గత 20 సంవత్సరాల నుంచి కొనసాగుతూ వస్తుంది. రాయపోల్ మండల కేంద్ర ప్రజలతోపాటు పరిసర గ్రామాల ప్రజలు, హైదరాబాద్లో నివాసం ఉండే గ్రామవాసులు ఆదివారం సాయంత్రానికి గ్రామానికి చేరుకొని కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారి కళ్యాణం తిలకించారు.
గడ్డి భాస్కర్ రెడ్డి దంపతులు కళ్యాణం నిర్వహించగా.. మరో 110 మంది దంపతులు కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. అంతకుముందు ఉదయం నుంచి రాత్రి వరకు గ్రామస్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ సంవత్సరం కొత్తగా స్వామివారికి విమాన రథోత్సవాన్ని దాతల సహకారంతో ఏర్పాటు చేశారు. గ్రామ ప్రజలు, యువకులు, కళ్యాణ మహోత్సవంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.
ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో పురోహితులు వెంకటేశ్వర శర్మ. జంగం మాణిక్య ప్రభు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.