Kanyaka parameshwari Temple | నర్సాపూర్, నవంబర్ 11 : పట్టణంలోని ధర్మశాల వెనకాల నూతనంగా నిర్మించిన కన్యకా పరమేశ్వరి ఆలయ దర్శనం కేవలం వైశ్య సమాజానికేనా అని నర్సాపూర్ పట్టణానికి చెందిన నాగేందర్ గౌడ్ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నర్సాపూర్ పట్టణంలో వైశ్యుల కులదైవం కన్యకా పరమేశ్వరి ఆలయాన్ని నిర్మించడం చాలా సంతోషకరమైన విషయం అన్నారు. వైశ్యులకు (కోమటి సమాజానికి) నమస్కరించి విజ్ఞప్తి చేస్తున్నాను. కన్యకా పరమేశ్వరి ఆలయం నిర్మించిన మీకు.. ఆలయంలో దర్శనాలు మీ వైశ్య సమాజానికేనా..? లేదా నర్సాపూర్ పట్టణ ప్రజలకు, చుట్టు ప్రక్కల గల గ్రామాల ప్రజలకు దర్శనాలు లేవా..? అని ప్రశ్నించారు.
అమ్మవారిని మేము దర్శించుకోవద్దా..? తెలిసో తెలువకో మా వర్గాలు అనగా మా సమాజం దర్శన నిమిత్తం దేవాలయానికి వస్తే కొందరు అక్కడినుండి మా గుడిలోకి రావద్దు అని బెదిరిస్తూ వెళ్లగొట్టడం జరుగుతుందనీ ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటప్పుడు ఆలయం చుట్టూ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసుకోవాలని, ఈ ఆలయానికి వైశ్యులు మాత్రమే రావాలని వేరే కులాలు రావద్దని బోర్డు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
మాతో మీకు మీతో మాకు సంబంధం లేదని ప్రకటన చేయాలి..
గతంలో ధర్మశాల వద్ద చుట్టుపక్క గ్రామాల వారు మంచిచెడు కార్యక్రమాలకు నిద్ర చేయడానికి వచ్చే వాళ్లను, ధర్మశాలను ఏర్పాటు చేసిన వారు వైశ్యులే కదా ఇతర సమాజంతో ఎలాంటి సంబంధం లేకుండా ఎలాంటి వాణిజ్య వ్యాపార సంబంధాలు లేకుండా మాతో మీకు మీతో మాకు సంబంధం లేదని పేపర్ ప్రకటనలు చేయాలని ఎద్దేవా చేశారు. ఆలయానికి వచ్చిన వాళ్లను మానసికంగా వేధించవద్దని విజ్ఞప్తి చేశారు. గత 40 సంవత్సరాల క్రితం వైశ్యులు అంటే ఎంతో గౌరవం ఉండేది.
అలాంటి సమాజం ఈ రోజు గుడిలోకి రానివ్వకుండా మమ్మల్ని దూరం పెడుతున్నారు. ఒకసారి ఆలోచన చేసుకోవాలని తెలిపారు. ఈ విషయంపై ఆర్యవైశ్య సంఘం సభ్యులు స్పందిస్తూ నాగేందర్ గౌడ్, అతని తమ్ముడు స్థలం విషయంలో మాపై దాడికి ప్రయత్నించారని, మా మీద కక్షతోనే లేనిపోని నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. గుడిలోకి ఎవరిని రానివ్వలేదో సాక్షాధారాలతో నిరూపించాలని డిమాండ్ చేశారు.
Dharmasagar | యూనియన్ బ్యాంక్ సేవలను సద్వినియోగం చేసుకోవాలి : బ్యాంక్ మేనేజర్ అనిల్
Madhira : లడకబజార్లో ఉచిత వైద్య శిబిరం