జహీరాబాద్, జూన్ 12 : జహీరాబాద్ మీదుగా బుల్లెట్ ట్రైన్ నడిపించాలని కోరుతూ జహీరాబాద్ పట్టణ బీఆర్ఎస్ నాయకురాలు, కౌన్సిలర్ నామ స్రవంతి ఆధ్వర్యంలో జహీరాబాద్ ప్రాంత మహిళలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పోస్ట్ కార్డుల పంపించారు. శుక్రవారం స్థానిక పట్టణంలోని ప్రధాన పోస్ట్ ఆఫీస్ కార్యాలయంలో జహీరాబాద్ ప్రాంత మహిళలందరి కలిసి మోదీకి జహీరాబాద్ మీదుగా బుల్లెట్ ట్రైన్ వెళ్లేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ పంపిన పోస్ట్ కార్డులో విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా పలువురు మహిళా ప్రజా ప్రతినిధులు నాయకురాలు తదితరులు మాట్లాడుతూ జహీరాబాద్ కాకుండా వికారాబాద్ మీదుగా హైదరాబాద్ ముంబై బుల్లెట్ ట్రైన్ వెళ్లేలా డిపిఆర్లు పొందుపరచడంతో తమ ప్రాంతానికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని కోరారు.
గతంలో హైదరాబాద్ పర్యటనకు వచ్చినప్పుడు ప్రధాని స్వయంగా జహీరాబాద్‌ను ఇండస్ట్రియల్ కారిడార్‌గా ప్రస్తావించిన విషయాన్ని గుర్తు చేశారు. మొదట బుల్లెట్ ట్రైన్ మార్గాన్ని జహీరాబాద్ మీదుగా ప్రతిపాదించినప్పటికీ, ఆ తర్వాత డీపీఆర్‌ను మార్చి వికారాబాద్ మీదుగా మళ్లించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధి కోసం వేలాది ఎకరాల వ్యవసాయ భూములను రైతులు త్యాగం చేశారని పేర్కొన్నారు.
రైతుల త్యాగాలను, జహీరాబాద్ ప్రాంత పారిశ్రామిక అవసరాలను దృష్టిలో ఉంచుకొని, బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనపై పునరాలోచించాలని డిమాండ్ చేశారు. కేవలం రైతుల ప్రయోజనాలే కాకుండా, వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ ప్రాంత ప్రజలందరికీ మెరుగైన రవాణా సదుపాయం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.ఈ కార్యక్రమంలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మ్యాడం సుధా, బిజ్జల కవిత, చింతా రేఖ, అర్థం సౌజన్య, తదితరులు పాల్గొన్నారు