హత్నూర, నవంబర్ 12 : వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన సంఘటన సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం కాసాల, దేవులపల్లి గ్రామ శివారుల్లో గురువారం రాత్రి చోటుచేసుకుంది.
హత్నూర పోలీసులు తెలిపిన వివరాలప్రకారం.. హత్నూర గ్రామానికిచెందిన కొడకంటి రామాగౌడ్(50) మహాంకాళి సాయికుమార్ ఇద్దరు గురువారం రాత్రి దౌల్తాబాద్ శివారులోని ఓ ఫంక్షన్హాల్లో జరుగుతున్న విందు కార్యక్రమానికి స్కూటీపై వెలుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో రామాగౌడ్, సాయికుమార్లకు తీవ్రగాయాలయ్యాయి.
చికిత్సనిమిత్తం ఇద్దరిని ప్రైవేటు దవాఖానకు తరలిస్తుండగా రామాగౌడ్ మార్గమధ్యలో మృతిచెందగా సాయికుమార్ చికిత్స పొందుతున్నాడు. మృతుడు రామాగౌడ్ కొడుకు నాగప్రభుగౌడ్ పిర్యాదుమేరకు కేసునమోదుచేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ లక్ష్మారెడ్డి తెలిపారు.
అదేవిధంగా చిద్రుప్ప గ్రామానికిచెందిన బంటు మహేశ్(23) హత్నూరలో జరుగుతున్న విందు కార్యక్రమానికి స్కూటీపై వస్తుండగా ప్రమాదవశాత్తు కాసాల శివారులోకి చేరుకోగానే అదుపుతప్పి కిందపడి తలకు భలమైన గాయాలుకావడంతో కుటుంబీకులు చికిత్సనిమిత్తం నర్సాపూర్ ప్రభుత్వ దవాఖానకు తరలించగా అప్పటికే మృతిచెందినట్లు అక్కడివైద్యులు తెలిపారు.
మృతుడి తండ్రి సత్యనారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.