జహీరాబాద్, మే 7 : సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని హద్నూర్ ఎస్ఐ చల్ల రాజశేఖర్ అన్నారు. బుధవారం న్యాల్కల్ మండల కేంద్రంలో ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సైబర్ నేరాలగాళ్ల మాయమాటలు విని ఉచ్చులో పడొద్దన్నారు. బ్యాంకు ఖాత, ఏటీఎం పిన్ నంబర్లు, ఓటీపీ వివరాలను ఎవరికి చెప్పవద్దన్నారు. బ్యాంకు లోన్లు ఇస్తామని ఫోన్లో చెబితే నమ్మి మోసపోవద్దని సూచించారు.
ఐపీఎల్ బెట్టింగ్, ఆన్లైన్ గేమ్స్ జోలికి యువత అసలు వెళ్లవద్దన్నారు. వాహనాలను నడిపేటప్పుడు తప్పని సరిగా ప్రతి ఒక్కరూ హెల్మెట్‌ను ధరించాలని సూచించారు. వాహనాలకు సంబంధించిన అన్ని పత్రాలను తప్పనిసరిగా కలిగి ఉండాలన్నారు. మైనర్లకు వాహనాలకు ఇస్తే సంబంధిత వాహన యాజమానిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో హెడ్‌కానిస్టేబుల్ శ్యామయ్య, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.