సంగారెడ్డి మే 31 (నమస్తే తెలంగాణ) : సంగారెడ్డి కలెక్టరేట్లో ఉమ్మడి మెదక్ జిల్లా కలెక్టర్లు, జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమీక్షకు మంత్రులు దామోదర రాజనర్సింహా, కొండా సురేఖ హాజరయ్యారు. అయితే, సమావేశంలో మంత్రి దామోదర రాజనర్సింహా ఒక్క మాట మాట్లాడలేదని సమాచారం. ఇందుకు మంత్రి కొండాసురేఖ వైఖరి కారణమని తెలుస్తుంది. జిల్లా ఇన్చార్జి మంత్రి కొండా సురేఖ, మంత్రి దామోదర్ మద్య కొంతకాలంగా పొసగటం లేదని ప్రచారం జరుగుతుంది. అయితే, ఉమ్మడి మెదక్ జిల్లా కలెక్టర్ల సమావేశం నిర్వహాణ తేదీ, స్థలం తనకు ముందస్తుగా చెప్పకుండానే ఇన్చార్జి మంత్రి కొండా సురేఖ ఖరారు చేయడంపై మంత్రి దామోదర్ అసంతృప్తికి గురైనట్లు సమాచారం.
మంత్రి కొండా సురేఖ శుక్రవారం మెదక్ కలెక్టరేట్లో ఉమ్మడి మెదక్ జిల్లా కలెక్టర్లు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించాలని నిర్ణయించారని.. ఆ మేరకు ఏర్పాట్లు చేసినట్లు ప్రచారం జరుగుతుంది. అయితే, మంత్రి దామోదర్ రాజనర్సింహా ఒత్తిడి మేరకు సమావేశం తేదీ, వేదిక మారినట్లు తెలుస్తుంది. శనివారం సంగారెడ్డిలో ఉమ్మడి మెదక్ జిల్లా కలెక్టర్లు, అధికారుల సమీక్షా సమావేశానికి మంత్రి దామోదర్ రాజనర్సింహ్మా హాజరైనప్పటికీ మాట్లాడకుండా మిన్నకుండిపోయినట్లు తెలుస్తున్నది. అయితే, దామోదర్ త్వరలోనే మళ్లీ మెదక్, సంగారెడ్డి జిల్లా కలెక్టర్లు, అధికారులతో వానాకాలం సన్నద్ధత, సీజనల్ వ్యాధులపై సమీక్ష నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం
ఇక సమావేశంలో మంత్రి కొండ సురేఖ మాట్లాడుతూ.. వర్షాలతో తడిసిన ధాన్యం కొనుగులు చేస్తామని రైతులు ఆందోళన చెందవద్దని తెలిపారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ధాన్యం సేకరణ, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, వ్యవసాయం, భూ భారతచట్టం, సంక్షేమ పథకాల అమలును సమీక్షించారు. సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ జిల్లాల కలెక్టర్లు వల్లూరు క్రాంతి, రాహుల్ రాజ్, మనుచౌదరి తమ జిల్లాలో సంక్షేమ పథకాల అమలు, ధాన్యం సేకరణ, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల గురించి తెలిపారు. అనంతరం మంత్రి సురేఖ మాట్లాడుతూ మూడు జిల్లాల్లో చివరి గింజ వరకు ధాన్యం సేకరించాలని అధికారులకు సూచించారు. అలాగే అర్హులు వారందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు లక్ష్యం మేరకు పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరు చేశామని, మరో 20 శాతం ఇళ్లు మంజూరికి ప్రభుత్వం అంగీకరించినట్లు చెప్పారు.
వానాకాలం సీజన్లో రైతులకు ఎరువులు, విత్తనాల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. సీజనల్ వ్యాధుల పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గ్రామాల్లో పారిశుద్ద్యం పనులు చేపట్టడంతోపాటు బ్లీచింగ్ పౌడర్ చల్లాలని తెలిపారు. తాగునీరు, కరెంటు సమస్యలు లేకుండా చూడాలన్నారు. ఎమ్మెల్యే సంజీవరెడ్డి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక కొరత లేకుండా చూడాలని కోరారు. ఎమ్మెల్సీ అంజిరెడ్డి మాట్లాడుతూ భూభారతి చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. ఈ సందర్భంగా అందోల్ మండలం అన్నసాగర్ డ్రోన్ దీదీలకు మంత్రులు దామోదర్ రాజనర్సింహా, కొండా సురేఖ డ్రోన్‌ను అందజేశారు. అనంతరం కలెక్టరేట్ ఆవరణలో నమోడ్రోన్ దీదీ పథకంలో భాగంగా శిక్షణ పూర్తి చేసుకున్న 57 మంది ఎస్‌హెచ్‌జీ మహిళలకు సబ్సిడీపై డ్రోన్ల పంపిణీని మంత్రులు దామోదర్, కొండా సురేఖ ప్రారంభించారు. 57 మంది మహిళలకు డ్రోన్లు అందజేయాల్సి ఉండగా మొదటి విడతలో 26 డ్రోన్లు, శిక్షణ సర్టిఫికెట్లు అందజేస్తున్నట్లు చెప్పారు. మహిళలకు స్వయం ఉపాధి కల్పించటంలో భాగంగా ఎస్‌హెచ్‌జీ మహిళలకు డ్రోన్లు అందజేస్తున్నట్లు తెలిపారు.