Sangareddy | సంగారెడ్డి మే 3(నమస్తే తెలంగాణ) : వేసవి తాపానికి తోడు తాగునీటికష్టాలతో సంగారెడ్డి జిల్లా వాసులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఓవైపు ఎండలు మండుతుంటే మరోవైపు గుక్కెడు నీటి కోసం ప్రజలు తిప్పలు పడాల్సివస్తోంది. మిషన్ భగీరథ పథకం నిర్వహణ లోపం ప్రజలకు శాపంగా మారుతుంది. మిషన్‌భగీరథ నిర్వహణ లోపం కారణంగా నారాయణఖేడ్, సంగారెడ్డి, పటాన్చెరు, జహీరాబాద్ నియోజకవర్గాల్లోని గ్రామాలు, తండాల్లోని ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు పడాల్సివస్తోంది.
నారాయణఖేడ్ నియోజకవర్గంలోని పలు గ్రామాలు, తండాలకు రెండురోజులకు ఒకమారు తాగునీరు సరఫరా అవుతుంది. దీంతో ప్రజలు, తండావాసులు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మిషన్‌భగీరథ ద్వారా తాగునీరు సరఫరా కానిరోజు ప్రజలు వ్యవసాయ బోర్ల వద్దకు వెళ్లి తాగునీరు తెచ్చుకోవాల్సి వస్తుంది. అయితే జిల్లాలో భూగర్భ జలమట్టాలు వేగంగా పడిపోతున్నాయి. జిల్లాలో 15.47 మీటర్ల లోతుకు భూగర్బజలమట్టాలు చేరుకున్నాయి. కంగ్టి మండలంలో అత్యధికంగా 27 మీటర్ల లోతుకు భూగర్బజలాలు పడిపోయాయి. దీంతో నారాయణఖేడ్ ప్రాంతంలో భూగర్భజలమట్టాలు తగ్గి వ్యవసాయబోర్లు, తాగునీటిబోర్లు సైతం ఎండిపోతున్నాయి. దీంతో ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు పడాల్సివస్తుంది.
Sangareddy2
నారాయణఖేడ్‌లో నీటి తిప్పలు అధికం
జిల్లాలో నారాయణఖేడ్ నియోజకవర్గంలోని ప్రజలు ఎక్కువగా నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో నారాయణఖేడ్ నియోజకవర్గ ప్రజలు దాహార్తి తీరేలా మిషన్‌భగీరథ ద్వారా ఇంటింటికి నల్లా కనెక్షన్లు ఇచ్చారు. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం మిషన్‌భగీరథ పథకాన్ని సక్రమంగా నిర్వహించకపోవడంతో నారాయణఖేడ్ నియోజకవర్గ ప్రజలు నీటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. కరెంటు కోతలకు తోడు మిషన్‌భగీరథ పైప్లైన్లు తరచూ పగిలిపోవటంతోపాటు లీకేజీలు అవుతున్నాయి. మిషన్ భగీరథ సిబ్బంది వెంటనే స్పందించి మరమ్మతులు చేయకపోవటంతో తాగునీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
నారాయణఖేడ్ పట్టణంలోని పలు వార్డులతో పాటు కంగ్టి, నాగల్గిద్ద, సిర్గాపూర్, కల్హేర్ మండలాల్లోని పలు గ్రామాలకు మిషన్‌భగీరథ నీళ్లు రెండురోజులకు ఒకమారు సరఫరా అవుతున్నాయి. నాగల్గిద్ద మండలంలోని కుబ్బాతండా, గంగారం తండా, ఇరక్‌పల్లి తండాతోపాటు చుట్టుపక్కల ఉన్న పది తండాలకు రెండురోజులకు ఒకమారు తాగునీరు సరఫరా అవుతుంది. దీంతో ప్రజలు తాగునీటికోసం ఇబ్బందులు పడుతున్నారు. తండాల్లోని బోరుబావుల నుంచి నీళ్లు రాకపోవటంతో గిరిజనులు వ్యవసాయక్షేత్రాల్లోని బోరుబావుల నుంచి తాగునీరు తెచ్చుకుంటున్నారు.
కంగ్టి మండలం జర్గితండా, దేగుల్వాడి, బోర్గి, బాన్సువాడ(డి) గ్రామాల్లో తరచూ మిషన్‌భగీరథ వాటర్ రాకపోవటం వ్యవసాయ బోర్లు నుంచి తెచ్చుకుంటున్నారు. సిర్గాపూర్ మండలంలోని అంతర్గావ్తండా, గైరాన్‌తండా, రూప్లాతండా, చందర్తండా గిరిజనులు తాగునీటి కోసం ఇబ్బందిపడుతున్నారు. కల్హేర్ మండలంలోని పోమ్యానాయక్తండా, నిజాంపేట మండంలంలోని బాచుపల్లి గ్రామస్తులు తాగునీటి సమస్యను ఎదుర్కొంటున్నారు. ఝరాసంగం మండలంలోని బోజ్యానాయక్ తండా, ఈదులపల్లి, ప్యాలవరం గ్రామాల్లో తాగునీటి సమస్య ఉంది. పటాన్చెరు మండలంలోని చిట్కుల్, ఇంద్రేశం, ముత్తంగి గ్రామాల్లో తాగునీటి సమస్య ఉంది. ముత్తంగి వద్ద జాతీయ రహదారి పనులు జరుగుతుండటంతో మిషన్‌భగీరథ పైప్‌లైన్ పగులగొడుతున్నారు. దీంతో నెలరోజులుగా ముత్తంగిలోని విజేత కాలనీ, పీఎస్కాలనీ, న్యూటౌన్ కాలనీలో నీటి సరఫరా జరగటంలేదు దీంతో ఆయా కాలనీవాసులు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు.
సంగారెడ్డి నియోజకవర్గంలో తరచూ మిషన్‌భగీరథ పైప్లైన్లు లీకేజీ జరుగుతుంది. దీంతో సంగారెడ్డి పట్టణంతోపాటు కంది, సంగారెడ్డి మండలాల్లోని పలు గ్రామాల ప్రజలు తాగునీటి సమస్యలు ఎదుర్కొవాల్సివస్తుంది. సంగారెడ్డి పట్టణంలోని పలువార్డులకు మిషన్‌భగీరథ నీరు సరఫరాకావటంలేదు.