పటాన్చెరు/పటాన్చెరు టౌన్, ఫిబ్రవరి 21 : సీఎం కేసీఆర్ సభకు పటాన్చెరు నుంచి భారీగా ప్రజలు, పార్టీ శ్రేణులు తరలివెళ్లారు. సోమవారం పటాన్చెరు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుంచి ప్రజలు బహిరంగ సభకు తరలివెళ్లారు. మరోవైపు టీఆర్ఎస్ మహిళా విభాగం నుంచి గూడెం యాదమ్మ ఆధ్వర్యంలో రెండు వేల మంది మహిళలు సభకు తరలివెళ్లారు. పటాన్చెరు పట్టణంలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి.. ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డితో కలిసి సీఎం సభకు వెళ్లే వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకం శంకుస్థాపన సందర్భంగా నారాయణఖేడ్‌లో భారీ బహిరంగ సభ చారిత్రాత్మకం కాబోతున్నదన్నారు. సీఎం కేసీఆర్ ప్రారంభిస్తున్న ప్రతి ప్రాజెక్టు ప్రజల్లో ఆదరాభిమానాలను పెంచుతున్నదన్నారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం సభకు భారీగా స్పందన వచ్చిందన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా సీఎం సభకు తరలివెళ్తున్నారని తెలిపారు. నిర్దేశించిన మొత్తం కంటే అధిక సంఖ్యలో ప్రజలు వస్తుండటం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణలో చేపడుతున్న ప్రతి ప్రాజెక్టు ప్రజల హృదయాలను గెలుచుకుంటున్నదన్నారు. మాజీ ఎమ్మెల్సీ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రైతుల పక్షపాతి అన్నారు. రైతులకు మేలు చేయాలనే ధృడ సంకల్పం ఉన్న వ్యక్తి కేసీఆర్ అని అన్నారు. తెలంగాణలో ప్రతి ఎకరాకు నీరందేలా సీఎం కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. సీఎంకు ప్రజా దీవెనలు ఉండటంతో చేస్తున్న ప్రతి పనికి ప్రజలు మద్దతు ఇస్తున్నారన్నారు. కార్యక్రమంలో పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్‌యాదవ్, టీఆర్ఎస్ నాయకులు ఎలక్షన్‌రెడ్డి, గూడెం మధుసూదన్‌రెడ్డి, నర్రా భిక్షపతి, షకీల్, వెంకట్‌రెడ్డి, మాజీ ఎంపీపీ యాదగిరియాదవ్, విష్ణువర్ధన్‌రెడ్డి, గోపాల్, లక్ష్మణ్, సురేశ్‌రెడ్డి, నగేశ్, భీమ్రాజ్, కార్యకర్తలు పాల్గొన్నారు.
అదేవిధంగా సంగారెడ్డి జిల్లాలోని గుమ్మడిదల, ఆర్సీపురం, బొల్లారం, జిన్నారం, కంది, సదాశివపేట మండలాల్లోని అన్ని గ్రామాల నుంచి పార్టీ శ్రేణులు, ప్రజలు సీఎం బహిరంగ సభకు భారీగా తరలి వెళ్లారు.