PDSU | పటాన్ చెరు, అక్టోబర్ 29 : విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న ప్రైవేట్ నర్సింగ్ కళాశాలపై చర్యలు తీసుకోవాలని పీడీఎస్‌యూ సంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు సందీప్ డిమాండ్ చేశారు. బుధవారం పటాన్చెరులో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడీఎస్‌యూ డివిజన్ కమిటీ సమావేశాన్ని స్థానిక ఆఫీసులో నిర్వహించారు.
పీడీఎస్‌యూ సంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు సందీప్ మాట్లాడుతూ.. పటాన్ చెరు మండలం ముత్తంగి గ్రామంలో ఉన్న ప్రైవేట్ నర్సింగ్ కాలేజీలో చదువుతున్న విద్యార్థినిలకు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఒకే బిల్డింగ్‌లో హాస్టల్ కం కాలేజీ నడిపిస్తూ అధిక ఫీజులు వసూలు చేస్తూ.. మొదటి సంవత్సరంలో అడ్మిషన్ అయిన విద్యార్థులకు మెడికల్ ఫీల్డ్‌పై అవగాహన లేకుండా ప్రాక్టికల్స్ అన్ని వివిధ హాస్పిటళ్లకు విద్యార్థులను పంపిస్తూ హాస్పిటల్ యజమాన్యాల నుండి డబ్బులు వసూలు చేస్తున్నారని.. ఎలాంటి తరగతులు బోధించకుండా పగలంతా హాస్పిటల్లో పనిచేసి రాత్రంతా క్లాసులు వినాలని నిర్బంధం విధించడం చేస్తున్నారన్నారు.
పరీక్ష ఫీజు పేరుతో అధిక డబ్బులు వసూలు చేయడంతోపాటు, క్రమశిక్షణ, డ్రెస్సులు, అటెండెన్స్ పేర్లతో డబ్బులను దండుకుంటూ కట్టిన డబ్బులకు ఎలాంటి రిసిప్ట్ ఇవ్వడం లేదన్నారు. సమస్యలపై విద్యార్థినులు ప్రశ్నిస్తే మిమ్మల్ని సస్పెండ్ చేస్తాం.. మిమ్మల్ని ఫెయిల్ చేస్తామని, ఇక్కడ జరిగే విషయాలు మీరు ఎవరికైనా చెప్తే మిమ్మల్ని విద్యకు దూరం చేస్తామని బ్లాక్ మెయిల్ చేస్తూ విద్యార్థులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు.
మీరు మేం చెప్పిందే వినాలి..
ప్రధానంగా నర్సింగ్ స్కూల్లో ఉన్నది అమ్మాయిలే.. మీరు మేం చెప్పిందే వినాలని వారికి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. జిల్లా కలెక్టర్, డీఎంహెచ్ఓ మొద్దు నిద్రను వీడి తక్షణమే స్పందించి కాలేజ్ యాజమాన్యంపై చర్యలు తీసుకొని విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని హెచ్చరించారు. రాబోయే రోజుల్లో విద్యార్థులకు అండగా పరోక్షంగా, ప్రత్యక్షంగా పీడీఎస్‌యూ పోరాటం కొనసాగిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్‌యూ డివిజన్ నాయకులు వాసు, అనిల్, శ్రీకాంత్, పావని, లావణ్య, సురేష్, అశ్విని, సుధా, మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
Landslides | భారీ వర్షానికి శ్రీశైలం ఘాట్ రోడ్డులో విరిగిపడిన కొండచరియలు.. ట్రాఫిక్‌కు అంతరాయం
Suicide: భార్యతో వీడియో కాల్లో మాట్లాడుతూ.. సౌదీలో ఆత్మహత్య చేసుకున్న భర్త
Jaanvi Swarup | హీరోయిన్గా మహేష్ బాబు మేనకోడలు..సంతోషం వ్యక్తం చేసిన మంజుల