Bus Fitness | పటాన్చెరు, మే 19 : ప్రైవేట్ కళాశాలలు, పాఠశాలలకు చెందిన బస్సులను వెంటనే యాజమాన్యం ఫిట్నెస్ చేయించుకోవాలని పటాన్చెరు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ (ఎంవీఐ) విజయ్‌రావు తెలిపారు. ఇవాళ పటాన్చెరులో ఉన్న ఎంవీఐ కార్యాలయంలో ప్రైవేట్ బస్సులను పరిశీలించి ఫిట్నెస్ పరీక్షలు చేశారు. బస్సులో సరైన సీట్లు ఉండాలని, అగ్నిమాపక సిలిండర్లు ఏర్పాటు చేయాలన్నారు.
మెడికల్ కిట్స్ అందుబాటులో ఉంచాలని, బస్సు వెనుక వైపు అత్యవసర ద్వారాలు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. బస్సు ఎక్కే సమయంలో విద్యార్థుల కోసం ప్రత్యేక మెట్లు ఏర్పాట్లు చేశారన్నారు. పటాన్చెరు ఎంవీఐ పరిధిలో 400 ప్రైవేట్ బస్సులు ఉన్నాయని, ప్రతీ బస్సును పరిశీలించి ఫిట్నెస్ పరీక్షలు చేస్తామన్నారు. పరీక్షలు చేసుకోకపోతే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.