Munipalli | మునిపల్లి, జనవరి 07: కలెక్టర్ అమ్మ.. పంచాయతీ కార్యదర్శుల సమస్యలపై జెర కనికరం చూపమ్మా.. అంటూ సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని పంచాయతీ కార్యదర్శులు జిల్లా కలెక్టర్‌ను వేడుకుంటున్నారు. పంచాయతీ కార్యదర్శుల సమస్యలు పరిష్కరించేవారే లేరా అంటూ అఆవదేన వ్యక్తం చేశారు.
మండలంలోని పంచాయతీ కార్యదర్శులను మునిపల్లి ఎంపీడీవో హరినందన్ రావు అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నారని సోమవారం జరిగిన గ్రీవెన్సీలో అధికారులకు ఇప్పటికే ఫిర్యాదు చేశారు. పూర్తి ఆధారాలను కూడా సమర్పించారు. గ్రామాల్లో పర్యటించే సమయంలో సంబంధిత పంచాయతీ కార్యదర్శుల వద్ద ఎంపీడీవో అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారని.. ఆయన చెప్పినట్లు వినకపోతే ఉద్యోగం నుంచి సస్పెండ్ చేస్తానంటూ బెదిరింపులకు గురిచేస్తున్నారని కలెక్టర్ ముందు పంచాయతీ కార్యదర్శులు తమ సమస్యలను వెల్లబోశారు. సదరు ఎంపీడీవోపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు.
గ్రామాల తనిఖీల పేరుతో మునిపల్లి మండలంలోని పంచాయతీ కార్యదర్శిల వద్ద ఎంపీడీవో హరినందన్ రావు అక్రమ వసూలు చేస్తూ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు పసికట్టిన నమస్తే తెలంగాణ రెండు నెలల క్రితమే ఒక కథనం ప్రచురించింది. ఈ కథనం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో ఎంపీడీవో హరినందన్ రావు అప్రమత్తమయ్యారు. తాము డబ్బులు ఇవ్వలేమని చెప్పాలని.. లేదంటే అంతుచూస్తానని పలువురు పంచాయతీ కార్యదర్శులను ఎంపీడీవో బెదిరించాడు. వారి చేత ఉన్నతాధికారులకు ఒక లేఖ కూడా రాయించారు.
కానీ ఎంపీడీవో టార్చర్ రోజురోజుకీ పెరిగిపోతుండటంతో.. భరించలేని పంచాయతీ కార్యదర్శులు ఎంపీడీవో అరాచకాలను బయటపెట్టారు. ఎంపీడీవో హరినందన్ రావు భార్య, కుమార్తె, కారు డ్రైవర్, అతని భార్య, ఎంపీడీవో కార్యాలయానికి సంబంధించిన అటెండర్స్ ఖాతాలో డబ్బులు వేసేవాళ్లమని ఒప్పుకున్నారు. గ్రామాల సందర్శన కోసం వెళ్లినప్పుడు డబ్బులు ఇవ్వాలని ఇబ్బందులకు గురిచేసేవారని.. మహిళా కార్యదర్శలు అని కూడా చూడకుండా నోటికొచ్చినట్లు బూతులు మాట్లాడేవాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు కలెక్టర్ ప్రావిణ్యకు తమ బాధను చెప్పుకున్నారు. మరి వారిపై కలెక్టర్ ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.
READ MORE :
Munipalli | మునిపల్లి ఎంపీడీవో అవినీతి బాగోతం.. పంచాయతీల తనిఖీల పేరుతో అడ్డగోలుగా పైసా వసూల్