Dhurandhar 2 | రణ్వీర్ సింగ్ కథానాయకుడిగా, సంచలన దర్శకుడు ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన అత్యంత భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ధురంధర్ 2’ (ది రివెంజ్) ట్రైలర్‌ను చిత్రబృందం శనివారం విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా తెలుగు వెర్షన్ ట్రైలర్‌ను తాజాగా వదిలింది చిత్రయూనిట్. గతేడాది బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించిన ‘ధురంధర్’ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న ఈ ట్రైలర్లో రణ్వీర్ సింగ్ ‘హంజా’ మరియు ‘జస్కిరత్ సింగ్ రంగీ’ అనే రెండు శక్తివంతమైన లుక్స్‌లో కనిపించి అభిమానులను ఆకట్టుకుంటున్నారు.
హాలీవుడ్ స్థాయి విజువల్స్, హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లతో నిండిన ఈ ట్రైలర్లో “పాకిస్థాన్ భవిష్యత్తును ఇప్పుడు ఇండియా నిర్ణయిస్తుంది” వంటి డైలాగులు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. ఇందులో సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, ఆర్. మాధవన్ వంటి భారీ తారాగణం కీలక పాత్రలు పోషిస్తుండగా, సంజయ్ దత్ చెప్పిన సంభాషణలు సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి.
ఈ చిత్రం ఉగాది, మరియు ఈద్ కానుకగా మార్చి 19, 2026న తెలుగు, హిందీతో పాటు ప్రధాన భారతీయ భాషల్లో విడుదల కానుంది. దాదాపు 3 గంటల 55 నిమిషాల సుదీర్ఘ నిడివితో వస్తున్న ఈ సినిమా కోసం మార్చి 18 సాయంత్రం 5 గంటల నుండే పెయిడ్ ప్రివ్యూలు ప్రారంభం కానున్నాయి.