Munipalli MPDO | మునిపల్లి ; అక్రమ వసూలు చేస్తున్న మునిపల్లి ఎంపీడీఓ హరి నందన్ రావుపై చర్యలు లేనట్టేనా..? అక్రమ వసూళ్ల అధికారిపై చర్యలు తీసుకునేందుకు జిల్లా అధికారులు ఎందుకు స్పందించడం లేదంటూ మండల వాసులు సంబంధిత అధికారుల తీరుఫై అసహనం వ్యక్తం చేస్తున్నారు.
మునిపల్లి మండల అభివృద్ధి అధికారి హరినందన్ రావు మండలంలో పంచాయతీ తనిఖీల పేరుతో కార్యదర్శిల వద్ద అక్రమ పైసా వసూలు చేసినట్లు పలు పత్రికల్లో కథనాలు వచ్చాయి. జిల్లా అధికారుల్లో ఇలా కదలికలు వచ్చి అలా సైలెంట్‌గా ఉండడం వెనుక ఉన్న మర్మమెంటో అర్థం కావడం లేదు అంటూ మునిపల్లి మండల వాసులు ఉన్నతాధికారుల వ్యవహారంపై పలు రకాల ఆరోపణలు చేస్తున్నారు.
అక్రమ వసూళ్లకు సంబంధించి అన్ని ఆధారాలు ఉన్నప్పటికీ మునిపల్లి ఎంపీడీఓపై చర్యలు తీసుకోవడంలో జిల్లా అధికారులు ముందుకు రాకపోవడంపై మండల వాసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మునిపల్లి ఎంపీడీవో పంచాయతీ కార్యదర్శిల వద్ద అక్రమ డబ్బులు వసూలు చేస్తున్నట్లు పత్రికలో రావడంతో హుటాహుటిన పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించి నాకు డబ్బులు ఇచ్చినట్లు ఎవరు చెప్పిండ్రు నాకు తెలవాలి అంటూ పంచాయతీ కార్యదర్శులపై ఉగ్రరూపం చూపించారు.
పంచాయతీ కార్యదర్శులను ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు ఉన్నతాధికారులకు సమాచారం ఉన్నప్పటికీ జిల్లా అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. దాని వెనుక ఉన్న మర్మమెంటో అర్థం కాక ఉన్నత అధికారుల తీరుపై మండల ప్రజలు మండిపడుతున్నారు.
లెటర్ రాయించుకోవడం ఎందుకు ?
మునిపల్లి మండల అభివృద్ధి అధికారి హరినందన్ రావు మండలంలోని పంచాయతీ కార్యదర్శిల వద్ద అక్రమంగా పైసా వసూలు చేయడమే గాక దానిని కప్పిపుచ్చుకోవడానికి పంచాయతీ కార్యదర్శులతో బలవంతంగా లెటర్ రాయించుకోవడంపై పంచాయతీ కార్యదర్శుల్లో గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. మండలంలోని పలువురు పంచాయతీ కార్యదర్శులు మేము ఎవ్వరికి డబ్బులు ఇవ్వలేమని మండలంలోని కొంతమంది పంచాయితీ కార్యదర్శులు బలవంతంగా పంచాయతీ కార్యదర్శులతో లెటర్ రాయించుకున్నట్లు తెలిపారు.
డబ్బులు తీసుకొని… డబ్బులు తీసుకోలేదని లెటర్స్ రాయించుకోవడం ఏంటి అని పంచాయతీ కార్యదర్శుల మధ్య స్వల్ప విభేదాలు వచ్చినట్లు సమాచారం. మునిపల్లి ఎంపీడీఓపై అక్రమ వసూళ్ల కథనం వచ్చినప్పటి నుంచి పంచాయతీ కార్యదర్శులను మునిపల్లి ఎంపీడీవో తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నరు. ఎంపీడీఓపై కథనం వచ్చిన మరుసటి రోజు నుంచి క్రమం తప్పకుండా ప్రతిరోజు ఉదయం 7-8 గంటల్లోపు కార్యదర్శులు సంబంధిత గ్రామాల్లో ఉండాలని ఆదేశాలు ఇవ్వడంతో పంచాయతీ కార్యదర్శకులు ఇబ్బందులకు గురవుతున్నట్లు కొంతమంది పంచాయతీ కార్యదర్శులు వారు ఎదుర్కొంటున్న సమస్యలను నమస్తే తెలంగాణతో పంచుకున్నారు.
వస్తున్నానని అంతలోనే డ్రాప్..?
మునిపల్లి ఎంపీడీఓ అక్రమ వసూళ్లపై విచారణకు హాజరవుతున్నట్లు సంగారెడ్డి జిల్లా జడ్పీ సీఈవో మునిపల్లి మండల పరిషత్ అధికారులకు సమాచారం ఇచ్చారు. అంతలోనే డ్రాప్ అవుతున్నట్లు మండల పరిషత్ అధికారులకు సమాచారం ఇచ్చినట్లు మండల పరిషత్ అధికారులు తెలిపారు. విచారణకు జడ్పి సీఈఓ హాజరు కాకపోవడంపై మండల వాసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
విచారణకు వస్తున్నట్లు చెప్పి వారం రోజులు గడుస్తున్నప్పటికీ నేటికీ అధికారులు నిమ్మకు నేరెత్తినట్లు వ్యవహరించడం ఏంటి..? అని మండల వాసులు జిల్లా అధికారుల తీరుపై అగ్రహారం వ్యక్తం చేశారు. అక్రమాలు చేస్తున్న అధికారిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం ఎందుకు వహిస్తున్నారో అని అధికారులఫై తీవ్రంగా మండిపడుతున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి మునిపల్లి ఎంపీడీవో హరినందన్ రావు అక్రమాలపై విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకోవాలని మండల వాసులు కలెక్టర్ కోరుతున్నారు.