Munipalli | మునిపల్లి, మే 02 : ఆ ఎంపీడీవో రూటే సపరేటు.. ప్రభుత్వ అధికారిని కదా అని ఆయన ఆఫీసులో కూర్చుని టైమ్ కాగానే వెళ్లిపోవడం చేయరు.. నిత్యం తన మండల పరిధిలోని ఏదో ఒక గ్రామాన్ని తిరుగుతూ పంచాయతీలను తనిఖీ చేస్తూ ఉంటారు. అలా అని ఆయనేదో స్ట్రిక్ట్ ఆఫీసర్ అనుకుంటే పొరపాటే.. అక్కడే అసలు కిటుకు ఉంది. తనిఖీలు చేసేది పంచాయతీల నిర్వహణ సరిగ్గా ఉందో లేదో తెలుసుకోవడానికి కాదు! వాళ్ల లొసుగులతో బెదిరించి పంచాయతీ సెక్రటరీల నుంచి డబ్బులు గుంజుకోవడానికి!! ఏ పంచాయతీ అధికారి అయినా సరే ఎంపీడీవో గ్రామాన్ని తనిఖీ చేసి వెళ్లేలోపు ఆయనకు డబ్బులు ఇవ్వాలి.. లేదంటే సదరు పంచాయతీ సెక్రటరీలపై ఏదో ఒక యాక్షన్ తప్పదు!! ఇదంతా సంగారెడ్డి జిల్లా మునిపల్లి ఎంపీడీవో హరినందన్‌రావు అవినీతి బాగోతం!!
వివరాల్లోకి వెళ్తే.. సంగారెడ్డి జిల్లా మునిపల్లి ఎంపీడీవో హరినందన్‌రావు మండలంలోని గ్రామాల్లో ఏదో పేరుతో నిత్యం తనిఖీ చేస్తుంటాడు. ప్రతి గ్రామంలో తనిఖీ చేయడం వరకు బాగానే ఉంది. కానీ అందులోనే అసలు మర్మం ఉంది. ఎంపీడీవో తనిఖీ చేసి వెళ్లేప్పుడు సంబంధిత గ్రామాలకు సంబంధించిన పంచాయతీ కార్యదర్శులు ఎంపీడీవో డ్రైవర్‌కు ఫోన్ పే లేదా గూగుల్ పేలో డబ్బులు పంపించాల్సిందే. ఎంపీడీవో మాట కాదని ఎవరైనా డబ్బులు పంపించడం నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత పంచాయతీ కార్యదర్శి సంగతి ఇక అంతే సంగతి. లేదంటే సంబంధిత పంచాయతీ కార్యదర్శికి ఇబ్బందులు గురికావాల్సిందే. ఈ క్రమంలోనే ఇటీవల ఓ గ్రామ పంచాయతీ కార్యదర్శి తనకు అనుకూలంగా పనులు చేయడం లేదని, అతన్ని మునిపల్లి మండలం నుంచి రైకోడ్ మండలానికి ట్రాన్స్ఫర్ చేశారు.
వాహనానికి పెట్రోల్ సైతం ఫ్రీనేనా..?
మునిపల్లి మండల పరిషత్ అధికారి నిత్యం తిరుగుతున్న వాహనంలో పెట్రోల్ సైతం ఎవరో ఒకరు కొట్టించాల్సిందే. లేదంటే ఆ కార్యదర్శి ఇబ్బందులు పడక తప్పదు. మునిపల్లి ఎంపీడీవో వాహనానికి మండలంలోని బుదేరా చౌరస్తాలోని ఓ పెట్రోల్ బంకులో నిత్యం పెట్రోల్ వేయించుకుంటాడు. పెట్రోల్ కు సంబంధించి బిల్లు మాత్రం మండలంలోని ఓ గ్రామానికి చెందిన పంచాయతీ కార్యదర్శి బిల్లు చెల్లిస్తారు. గత రెండు మూడు నెలల నుంచి పెట్రోల్ బంకులో బిల్లు చెల్లించకపోవడంతో సంబంధిత పెట్రోల్ బంకు వాళ్లు ఎంపీడీవో వాహనానికి పెట్రోల్ పోయలేదు. దీంతో సదరు పంచాయతీ కార్యదర్శిపై ఎంపీడీవో కక్ష సాధింపుచర్యలకు పాల్పడుతున్నారని సమాచారం.
చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం ఎందుకు?
అక్రమాలకు పాల్పడుతూ విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న మునిపల్లి ఎంపీడీవోపై జిల్లా కలెక్టర్, జిల్లా అధికారులు చర్యలు తీసుకోవడంలో ఎందుకు అంత నిర్లక్ష్యం వహిస్తున్నారో అర్థం కావడం లేదని మండల వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత అక్టోబర్ నెలలో ఎస్సీ కార్పొరేషన్ రుణాలు కాంగ్రెస్ నాయకులకే ఇస్తామని ఎంపీడీవో ప్రకటించినట్లుగా నమస్తే తెలంగాణలో వచ్చిన కథనానికి జిల్లా కలెక్టర్, అధికారులు స్పందించకపోవడంపై స్థానిక మండల వాసులు జిల్లా అధికారులపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీ అండ ఉండటం వల్లే సదరు ఎంపీడీవోపై చర్యలు తీసుకోవడం లేదని అనుకుంటున్నారు. ఉన్నత అధికారులు నిర్లక్ష్యం విడి మునిపల్లి ఎంపీడీవోపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.