MLA manik Rao | ఝరాసంగం, ఏప్రిల్ 14: విశ్వశాంతి కోసం బర్దిపూర్ దత్తగిరి మహా రాజ్ ఆశ్రమంలో ప్రతీ నెల బహుళ విదియ రోజున మహా మృత్యుంజయ యజ్ఞం నిర్వహించడం అభినందనీయమని జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు అన్నారు. ఇవాళ ఆశ్రమ ఆవరణలో నిర్వహించిన మృత్యుంజయ లక్ష జప యజ్ఞం, శివపార్వతుల కళ్యాణానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.
జ్యోతిర్లింగాలకు, దత్తాత్రేయ స్వామి, అత్రి అనసూయ, పంచ వృక్షాలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అంతకుముందు ఉదయం గోపూజ, గణపతి పూజ, రుద్రాభిషేకం, మహా మంగళహారతి అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యజ్ఞశాలలో మహా మృత్యుంజయ ప్రారంభించారు.
భక్తులు శ్రీ మహామృత్యుంజయ మంత్రాన్ని లక్షసార్లు పారాయణం చేశారు. మధ్యాహ్నం 2:01 నిమిషాలకు మహా మృత్యుంజయ యాగం మంగళహారతి నిర్వహించి పూర్ణాహుతి చేశారు. ఎమ్మెల్యేకు ఆశ్రమ పీఠాధిపతి అవధూతగిరి మహారాజ్ పూలమాల శాలువాతో సన్మానించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఆయన వెంట మండల అధ్యక్షులు వెంకటేశం, నాయకులు సంగమేశ్వర్, రాజు, పండరినాథ్, శ్రీనివాస్ రెడ్డి, శంకర్, సిద్ధన్న పాటిల్, ఏజాజ్ బాబా, రాజేందర్ తదితరులు ఉన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉత్సవ కమిటీ చైర్మన్ గోటూరు రమేష్ పాటిల్, కమిటీ సభ్యులు కోట శ్రీనివాస్, బి. కృష్ణ, బోయిని ఎల్లన్న, నాగన్న పాటిల్ తగు ఏర్పాట్లు చేశారు.