జహీరాబాద్/ఝరాసంగం, ఏప్రిల్ 3: వేతనాల కోసం మిషన్ భగీరథ (Mission Bhagiratha) కార్మికులు ఆందోళన చేస్తుండటంతో తాగునీటి కోసం ప్రజలు తండ్లాడుతున్నారు. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం రాఘవపూర్ గ్రామ శివారులోని మిషన్ భగీరథ ఫిల్టర్ బెడ్ పరిధిలో పనిచేస్తున్న కార్మికులకు గత 8 నెలల నుంచి వేతనాలు అందలేదు. దీంతో వేతనాలను వెంటనే ఇవ్వాలంటూ ఆందోళనకు దిగారు. కార్మికుల ఆందోళనలు గురువారానికి మూడో రోజుకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో న్యాల్కల్, ఝరాసంగం, రాయికోడ్ మండలాల పరిధిలోని 75 గ్రామాలకు మిషన్ భగీరథ తాగునీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. ఫలితంగా ఆయా గ్రామాల ప్రజలు తాగునీటి కోసం తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. రోజురోజుకు ఎండల తీవ్రతరం అవుతుండటంతో దూప తీర్చుకునేందుకు ప్రజలు నానా అవస్థలకు గురికావాల్సిన పరిస్థితి నెలకొంది. బిందెడు నీళ్ల కోసం గ్రామాల సమీపంలోని వ్యవసాయ బోరు బావుల వద్దకు పరుగులు పెడుతున్నారు.
అధికారులు నెలనెలా వేతనాలు చెల్లించకపోవడంతో మిషన్ భగీరథ కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వేతనాల కోసం సంబంధిత అధికారులకు మొరపెట్టుకున్నప్పుడల్లా కొంత మేరకు చెల్లించి ఆ తర్వాత మళ్లీ మర్చిపోవడంతో కార్మికులకు ఇబ్బందులు తప్పడం లేదు. మార్చి 28వ తేదీలోగా వేతనాలు చెల్లిస్తామని సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్ కార్మికులకు హామీ ఇచ్చారు. రోజులు గడుస్తున్నప్పటికీ ప్రతిఫలం దక్కకపోవడంతో కమిషన్ భాగీరథ తాగునీటి సరఫరాను కార్మికులు నిలిపివేశారు. దీంతో ఆయా గ్రామాల్లో తాగునీటి కోసం ఇబ్బందులకు పడుతున్నా సంబంధిత అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు జోక్యంచేసుకుని కార్మికులకు వేతనాలు చెల్లించాలని, తాగునీటి సరఫరాను పునరుద్ధరించేలా చర్య తీసుకోవాలని ఆయా మండలాల ప్రజలు కోరుతున్నారు.