పెనుబల్లి, మార్చి 9 : వరి పొలాలు ఎండిపోతున్నాయి.. నీళ్లివ్వండి మహాప్రభో అంటూ ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం బ్రాహ్మళ్లకుంటకు చెందిన రైతులు సోమవారం ఆందోళనకు దిగారు. పులిగొండం చెరువు (ప్రాజెక్టు) కింద బ్రాహ్మాళ్లకుంటకు చెందిన సుమారు 200 మంది రైతులు 300 ఎకరాలు సాగు చేస్తున్నారు. ముప్పై ఏండ్ల నుంచి ఇదే ప్రాజెక్టు కింద వరి సాగు చేస్తున్నామని, కానీ ఎకో టూరిజం పేరిట ప్రభుత్వం నీళ్లు ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నదంటూ రైతులు ఎకో టూరిజం గేటు వద్ద నిరసన తెలిపారు. అనంతరం పంచాయతీ కార్యాలయం వద్ద మహిళా రైతులతో కలిసి పెద్దఎత్తున నినాదాలు చేశారు. చెరువును నమ్ముకొనే వ్యవసాయం చేసుకుంటున్నామని తెలిపారు. వరి పొట్టదశకు వచ్చిన సమయంలో తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నా తమను పట్టించుకోకపోవడం దురదృష్టకరమని ఆవేదన చెందుతున్నారు.