Zaheerabad | జహీరాబాద్, మార్చి 24 : ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో వాటర్ప్లాంట్ల పేరిట మంచినీటి వ్యాపారం జోరుగా సాగుతున్నది. జహీరాబాద్లో పుట్టగొడుగుల్లా వాటర్ ప్లాంట్లు పుట్టుకొచ్చాయి. అధికారులు అనుమతులు లేకుండా, నాణ్యతా ప్రమాణాలను గాలికి వదిలేసి విచ్చలవిడిగా వ్యాపారం చేస్తున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదు. పరిశుభ్రత లేని నీటిని తాగి జనాలు అనేక రకాల వ్యాధుల బారిన పడే అవకాశం కనిపిస్తోంది.
జహీరాబాద్ నియోజకవర్గంలోని ఆయా మండలాల్లో ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే పలువురు విచ్చలవిడిగా ఆర్వో ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నారు. గృహ అవసరాల కోసమని బోర్లు ఏర్పాటు చేసుకొని వాటి నుంచి నీటిని ప్యూరిఫైయర్ ద్వారా శుద్ధి చేసి ట్యాంకర్లకు పంపుతున్నారు. కొందరు నేరుగా బోరు నీటినే క్యాన్లు, బాటిళ్లు, ప్యాకెట్లలో నింపుతున్నారు. క్యాన్ నీటిని రూ.20కి, కూలింగ్ చేసి అయితే రూ.40కి విక్రయిస్తున్నారు. అయితే ఆ వాటర్ బాటిళ్లు, క్యాన్లకు అందమైన స్టిక్కర్లు వేయడడంతో గృహస్తులతో పాటు కంపెనీలు కూడా ఆకర్షితులై వాటిని కొనుగోలు చేస్తు్న్నారు. కానీ తాము తాగుతున్న నీరు పరిశుభ్రమైనదేనా? నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉందో లేదో తెలుసుకోవడం లేదు. ఆ దీంతో ఆ నీటిని దాగి రోగాల బారిన పడుతున్నారు.
నియోజకవర్గంలోని న్యాల్కల్, ఝరాసంగం, కోహిర్, మొగుడంపల్లి, జహీరాబాద్ మండలాలతోపాటు జహీరాబాద్ పట్టణంలో వాటర్ ప్లాంట్ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. వీటిలో అన్నిశాఖల అనుమతులతో నిర్వహణ సాగిస్తున్నవి కొన్ని మాత్రమే ఉన్నట్లు సమాచారం. నీటి ప్యాకెట్లు, క్యాన్ల మీద.. నీటి తయారు తేదీ, బ్యాచ్ నెంబర్, బెస్ట్ బిఫోర్ వంటివేవీ కనిపించవు. ప్రధానంగా వాటర్ క్యాన్లలో నేరుగా 20 లీటర్లు నీరు పోసి అవసరమైన వారికి సరఫరా చేస్తున్నారు. వాటర్ క్యాన్లు సైతం అపరిశుభ్రంగా ఉంటున్నాయి. వాటర్ ప్లాంట్ల నిర్వాహకులు నిబంధనలు పాటించపోయినా అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు.
వాటర్ ప్లాంటు ఏర్పాటు చేయాలంటే ముందుగా ఆహార కల్తీ నిరోధకశాఖ, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, సేల్స్ టాక్స్, జిల్లా పరిశ్రమల శాఖ, ఐఎస్ఐ వంటి ప్రభుత్వ శాఖలతో పాటు నీటిప్లాంట్ ఏర్పాటు చేస్తున్న పరిధిని బట్టి పంచాయతీ, నగర పంచాయతీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్ల అధికారుల నుంచి అవసరమైన అనుమతులు తీసుకోవాలి. ప్రాథమిక అనుమతి కోసమే రూ.3లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. ప్రతి సంవత్సరం రూ.89వేలు కట్టి రెన్యూవల్ చేసుకోవాలి. ప్రతి కేంద్రంలోనూ నీటి పరీక్షల కోసం మైక్రో బయాలజీ, కెమిస్ట్రీ ల్యాబ్లు, ఏసీ ల్యాబ్లు ఏర్పాటు చేయాలి. ప్రభుత్వ నిబంధనలన్నీ పాటించి వాటర్ ప్లాంట్ చేయాలంటే రూ.30లక్షలకు పైగా ఖర్చవుతుంది. కానీ ప్రమాణాలు పాటించకుండా ఎక్కువ మంది రూ.5 నుంచి 7 లక్షలు మాత్రమే వెచ్చించి ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నారు.
నాణ్యతలేని నీటిని తాగడం వల్ల గొంతునొప్పి, జలుబు, దగ్గు, టాన్సిల్స్ తదితర వ్యాధులు సోకుతాయి. నీటిని వేడిచేసి చల్లార్చి తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతోమేలు. వీలుకాని సమయాల్లో ప్యాకెట్లకు బదులు బ్రాండెడ్ కంపెనీల నీటిని తీసుకుంటే మంచిదని వైద్య అధికారులు సూచిస్తున్నారు.