CC Road |మనూరు, మే 21 : సీసీ రోడ్డు బీటలు బారిపోయి ప్రయాణం నరకయాతనగా మారింది. అర కిలో మీటర్ దూరం వరకు సీసీ రోడ్డు పూర్తి స్థాయిలో దెబ్బ తినడంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. ప్రత్యేకించి జాతర ఉత్సవాలకు అనేక ప్రాంతాల నుంచి భక్తులు ప్రయాణం చేసేది ఇదే రోడ్డు కావడంతో ఆలయానికి వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
మనూరు మండల పరిధిలోని బోరంచ గ్రామ శివారులో వాగుకు రెండు పక్కల సీసీ రోడ్డు నిర్మాణం దెబ్బతినడంతో ప్రయాణం ఇబ్బందికరంగా మారింది. మనూరు మండలం బోరంచ, రేగోడ్ మండలం సిందోల్ గ్రామాల మధ్యన ఉన్న కల్వర్టు రోడ్డు గత కొన్ని రోజులుగా పూర్తి స్థాయిలో బీటలు బారి పోయింది. రేగోడ్ మండలం సింధోల్ గ్రామం మీదుగా బోరంచ గ్రామ శివారు వరకు నూతనంగా బీటీ రోడ్డు నిర్మణం చేపట్టారు.
సిందోల్, బోరంచ గ్రామాల మద్య ఉన్న సీసీ రోడ్డు మరమ్మత్తులు చేయకపోవడంతో రోడ్డు మొత్తం బీటలు బారింది. బీటలు బారిన సీసీ రోడ్డుపై బైకులు, ఆటోల ప్రయాణం పూర్తి స్థాయిలో ఇబ్బందికరంగా మారింది. గతంలో కూడా రోడ్డు మరమత్తులు చేపట్టాలని తెలిపినా అధికారులు పట్టించుకోలేదని పలు గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు.
భక్తులు ఇదే దారి నుంచి వస్తుంటారని..
ముఖ్యంగా మండల పరిధిలో ఉన్న బోరంచ నల్ల పోచమ్మ అమ్మవారి జాతర ఉత్సవాలు 45 రోజుల పాటు కొనసాగనున్నాయి. జాతర ఉత్సవాలకు మనూరు మండల కేంద్రంతోపాటు నారాయణఖేడ్ మండలం రుద్రారం, పంచగామ, రేగోడ్ మండలం లింగంపల్లి గ్రామాల నుంచి దారులు ఉన్నాయి. కాగా జిల్లాలోని పలు గ్రామాల నుంచి అత్యధికంగా భక్తులు ఇదే దారి నుంచి వస్తుంటారని పలు గ్రామాల ప్రజలు పేర్కొంటున్నారు.
ముఖ్యంగా వర్షం పడితే రోడ్డుపై ప్రయాణం మరింత ఇబ్బందికరంగా మారుతుందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. గత వారం రోజుల నుంచి వర్షాలు పడుతుండడంతో అవస్థలు తప్పడం లేదని ఆలయానికి వచ్చే పలు గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు.
బీటలు బారిన సీసీ రోడ్డులో ద్విచక్ర వాహనల చక్రాలు బీటలలో ఇరుక్కుంటే ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉందని ద్విచక్ర వాహనదారులు వాపోతున్నారు. బీటలు బారిన సీసీరోడ్డులో ఇటీవల పలు బైకులు ప్రమాదాలకు గురయ్యాయని గ్రామస్తులు పేర్కొంటున్నారు. సంబంధిత అధికారులు స్పందించి బీటలు బారిన సీసీ రోడ్డుకు మరమ్మత్తులు చేపట్టాలని పలు గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
Indian origin techie | అమెరికాలో భారత సంతతి వ్యాపారవేత్త దారుణ హత్య.. బస్సులో కత్తితో దాడి చేసి