ముంబై, ఫిబ్రవరి 27 : దేశీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారీగా నిధులను తరలించుకుపోవడం, అంతర్జాతీయ మార్కెట్లు బలహీనంగా ట్రేడవుతుండటం, పలు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో మదుపరులు అమ్మకాలకు మొగ్గుచూపారు. నష్టాల్లో ప్రారంభమైన సూచీలకు మధ్యాహ్నం తర్వాత గ్లోబల్ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలు మరింత నష్టాల్లోకి నెట్టాయి. ఇంట్రాడేలో వెయ్యి పాయింట్లకు పైగా నష్టపోయిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ వారాంతపు ట్రేడింగ్ ముగిసే సరికి 961.42 పాయింట్లు లేదా 1.17 శాతం కోల్పోయి 81,287.19 వద్ద ముగిసింది.
మరో సూచీ నిఫ్టీ 317.90 పాయింట్లు లేదా 1.25 శాతం నష్టపోయి 25,178.65 వద్ద స్థిరపడింది. దీంతో మదుపరులు రూ.5 లక్షల కోట్ల సంపదను కోల్పోయారు. బీఎస్ఈలో లిైస్టెన కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ రూ.4,98, 603.42 కోట్లు కరిగిపోయి రూ.4,63, 50, 671.27 కోట్లు (5.10 ట్రిలియన్ డాల ర్లు) చేరుకున్నది. దేశీయ స్టాక్ మార్కె ట్లు దిద్దుబాటుకు గురవుతున్నాయని, అంతర్జాతీయ మార్కెట్లు బలహీనంగా ఉండటంతో మదుపరుల్లో సెంటిమెంట్‌ను నీరుగార్చిందని జియోజిట్ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. అమెరికా-ఇరాన్ దేశాల మధ్య యుద్ధమేఘాలు కమ్ముకుంటుండటం, ఏఐకి సంబంధించి అనిశ్చిత పరిస్థితులు కూడా తోడవడంతో మదుపరులు తమ పెట్టుబడులను ఈక్విటీల నుంచి బంగారం వైపు మళ్లించడం కూడా పతనానికి ఆజ్యంపోశాయన్నారు.