బంజారాహిల్స్, ఫిబ్రవరి 27: ‘మా మేడమ్ వద్ద భారీగా బంగారు కడ్డీలు ఉన్నాయి.. బ్లాక్ మనీని వైట్ చేసుకునేందుకు ఆభరణాలు కొనాలనుకుంటున్నారు..’ అంటూ నమ్మించి కేజీ బంగారు నగలతో ఉడాయించిన ఘరానా మోసగాడిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. బంజారాహిల్స్ రోడ్ నెం.2లో ‘స్వర్ణ కావ్యం’ పేరుతో ఆభరణాల షాపు నిర్వహిస్తున్న పాలకుర్తి లక్ష్మీకావ్యకు ఈనెల 17న శ్రీనాథ్ రాఠీ అలియాస్ అంకిత్(31) అనే వ్యక్తి ఫోన్ చేశాడు.
తాను ప్రముఖ వ్యాపారి సుబ్బరామిరెడ్డి కుమార్తె పింకీరెడ్డి పీఏనంటూ పరిచయం చేసుకున్నాడు. పింకీ రెడ్డి కుటుంబం వద్ద భారీగా బంగారం బిస్కెట్లు ఉన్నాయని, వీటిని ఇచ్చి ఆభరణాలుగా మార్చుకోవాలనే ఆలోచనలో ఉన్నారని తెలిపాడు. వీటితోపాటు బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చుకునేందుకు మీ షాపులో ఆభరణాలు కొనుగోలు చేస్తే మీ ట్రాన్సాక్షన్స్ కూడా పెరిగి బ్యాంక్ లోన్లు వస్తాయని నమ్మబలికాడు. ఈ మేరకు లక్ష్మీకావ్యను కలిసిన శ్రీనాథ్ రాఠీ, అతడి అనుచరులు కృష్ణ, మనోజ్ అనే వ్యక్తులు మొదట 16తులాల బంగారు నగలు తీసుకుని రెండు చెక్కులు ఇవ్వడంతో పాటు మరుసటిరోజు 160 గ్రాముల బంగారం బిస్కెట్ ఇచ్చారు.
రెండ్రోజుల తర్వాత ఇదే విధంగా 30 తులాల ఆభరణాలు తీసుకుని ఆ మేరకు బంగారం బిస్కెట్ ఇచ్చారు. మూడోసారి 50 తులాల బంగారం ఆభరణాలు తీసుకుని మరుసటిరోజు దానికోసం రూ.9లక్షలు ఇచ్చి నమ్మకం కలిగించాడు. ఇదే క్రమంలో ఈనెల 25న కేజీ బంగారు ఆభరణాలు తీసుకున్న శ్రీనాథ్ రాఠీ మరుసటి రోజు బంజారాహిల్స్ రోడ్ నెం.3లోని లీలా హోటల్లో కృష్ణ అనే యువకుడితో 1800గ్రాముల బంగారం కడ్డీ పంపించాడు. అతడు తెచ్చిన బంగారం కడ్డీపై అనుమానం రావడంతో పరీక్ష కోసం పంపించగా అది నకిలీ అని తేలింది. దీంతో గురువారం రాత్రి బాధితురాలు లక్ష్మీకావ్య బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇదిలా ఉండగా నకిలీ బంగారం అంటగట్టి కేజీ ఆభరణాలు తస్కరించిన శ్రీనాథ్ రాఠీ అలియాస్ అంకిత్ కాచిగూడలోని నింబోలీ అడ్డాలో నివాసం ఉంటూ గతంలో గతంలో యూట్యూబ్లో చార్టెడ్ అకౌంటెంటెన్సీ మీద పాఠాలు చెబుతుండేవాడని పోలీసుల విచారణలో తేలింది. తన యూట్యూబ్ పాఠాలు చూసిన కొంతమంది చార్టెడ్ అకౌంటెంట్స్ను బిజినెస్ ఐడియాలు ఇస్తానంటూ నమ్మించి కోట్లాది రూపాయల మేర మోసాలకు పాల్పడడంతో రెండేళ్ల క్రితం సీసీఎస్ పోలీసులు అతడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు గుర్తించారు.
పలు ప్రాంతాల్లో రకరకాల మోసాలకు పాల్పడుతున్నాడని, లగ్జరీ హోటళ్లలో బస చేయడం, ప్రముఖులతో పరిచయాలున్నాయని నమ్మించి భారీగా మోసాలు చేయడంలో శ్రీనాథ్ రాఠీ దిట్ట అని తెలుస్తోంది. శ్రీనాథ్ రాఠీ అనుచరుడు కృష్ణ(24)ను బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అతడి కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలిస్తున్నారు.