వనపర్తి, ఫిబ్రవరి 27(నమస్తే తెలంగాణ) : వనపర్తి మెడికల్ కళాశాల ఆవరణలో యంగ్ ఇండియా స్కూల్ నిర్మాణం వద్దని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి హితవు పలికారు. మెడికల్ కళాశాల ఆవరణలో యంగ్ ఇండియా స్కూల్ నిర్మాణం కోసం 8ఎకరాల స్థలం కేటాయించడాన్ని మెడికల్ కళాశాల విద్యార్థులు ముక్తకంఠంతో వ్యతిరేకిస్తూ మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డికి వినతి పత్రం ఇచ్చారు. ఈ ప్రతిపాదనను నిలిపి వేయాలని కోరిన క్రమంలో శుక్రవారం మెడికల్ కళాశాలను మాజీ మంత్రి పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. జిల్లా కేంద్రంలో మెడికల్ కళాశాల క్యాంపస్ కోసం 2021 ఏడాదిలో 50ఎకరాల స్థలాన్ని కేటాయించామన్నారు.
మెడికల్ కళాశాలతోపాటు ప్యారా మెడికల్ కళాశాల, హాస్టళ్లు, రీసెర్చ్ సెంటర్ వసతులను దృష్టిలో ఉంచుకొని స్థల కేటాయింపు జరిగిందన్నారు. పూర్తి స్థాయిలో నిర్మాణాలు జరిగితే..భవిష్యత్‌లో ఈ స్థలం కూడా ఈ విభాగాలకు సరిపోతుందో లేదో అన్నట్లు ఉంటుందన్నారు. ప్రభుత్వ అనాలోచిత చర్యల వల్ల స్కూల్ నిర్మాణం పేరుతో స్థల కేటాయింపు విద్యార్థులకు ఏమాత్రం క్షేమకరం కాదన్నారు. మెడికల్ కళాశాలలో విద్యార్థులు నిర్వహించే పరీక్షల నుంచి వెలువడే వ్యర్థ శరీర భాగాలు డిస్పోజబుల్ మేనేజ్మెంట్ ద్వారా తరలిస్తారని తెలిపారు. ఈ వాతావరణంలో ఇదే ఆవరణలో స్కూల్ విద్యార్థులకు భవన నిర్మాణ ప్రతిపాదన ఎంతమాత్రం క్షేమకరం కాదన్నారు.
మెడికల్ కళాశాల విద్యార్థుల అభిప్రాయం తెలుసుకున్న అనంతరం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి దామోదర రాజనరసింహకు నిరంజన్‌రెడ్డి లేఖ రాశారు. దీనికి ముందు ఫోన్‌చేసి స్కూల్ నిర్మాణం కోసం స్థల కేటాయింపును పునరాలోచించాలని కోరారు. ప్రభుత్వ స్థలాలు అనేకం అందుబాటులో ఉన్నాయని, అవేవీ సరిపోలేదనుకుంటే నా సొంత వ్యవసాయ స్థలం ఇవ్వడానికైనా తాను సిద్ధమని, మెడికల్ కళాశాల ఆవరణలో స్కూల్ నిర్మాణం చేపట్టడం సరైంది కాదన్నారు. దీనిపై ప్రభుత్వం పునరాలోచించని పక్షంలో ఎలాగైనా నిలిపివేసేందుకు తమ వంతుగా ప్రయత్నం చేస్తామని మెడికల్ కళాశాల విద్యార్థులకు నిరంజన్‌రెడ్డి భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు గట్టు యాదవ్, వాకిటి శ్రీధర్, అశోక్, బాలపీరు, శ్రీకర్ గౌడ్, ప్రేమ్‌నాథ్ రెడ్డి, పరంజ్యోతి, మురళీ సాగర్, హరిబాబు, కృష్ణ, నరసింహా, రవి ప్రకాశ్ రెడ్డి, హేమంత్, హుస్సేన్, రాము, ప్రేమ్ కుమార్, తేజారెడ్డి పాల్గొన్నారు.
వనపర్తి టౌన్, ఫిబ్రవరి 27 : సమాజంలో పెడధోరణి వల్ల న్యాయవాదులకు రక్షణ కరువైందని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో రక్షణ కోసం చట్టం కావాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన రిలే నిరాహార దీక్షా శిబిరాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ న్యాయవాదులకు కోసం ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. కక్షిదారుడికి న్యాయం చేయడమే న్యాయ వాది వృత్తి ధర్మమని, అంతమాత్రాన కక్ష పెంచుకొని దాడులు చేయడం అవివేకమన్నారు. న్యాయవాదులు చేస్తున్న పోరాటానికి పూర్తి మద్దతు ఉంటుందని ఆయన చెప్పారు. మాజీ మంత్రితో పాటు నాయకులు, న్యాయవాదులు పాల్గొన్నారు.