కంది, మే 10: గ్రామీణ ప్రాంతాల్లోని యువతలో క్రీడాస్పూర్తిని పెంచేందుకు గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాలు నిరుపయోగంగా మారాయి. యువత ఆడుకునేందుకు ఏర్పాటు చేసిన పరికరాలు నిర్వహణ లోపంతో శిథిలావస్థకు చేరాయి. ప్రాంగణాల్లో ముళ్ల పొదలు పెరగటంతో ఆటలు ఆడుకునేందుకు ఎవ్వరు ముందుకు రావడం లేదు. అన్ని సౌకర్యవంతంగా ఉంటే ఈ వేసవి సెలవుల్లో యువతకు ఉపయోగకరంగా ఉండేవి. కాని వీటి గురించి పట్టించుకునే వారే కరువయ్యారు. ఎంతో ఖర్చు చేసి ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగాణాలను వినియోగంలో తీసుకురావాలని యువకులు కోరుతున్నారు.
పట్టింపు కరువైన పల్లెప్రకృతి వనాలు
ప్రజలకు ఆహ్లదం పంచే పల్లె ప్రకృతి వనాలు పట్టింపునకు కరువయ్యాయి. కంది మండలం కాశీపూర్ గ్రామ ప్రకృతి వనం ఎండిపోయి రాలిన ఆకులతో నిండిపోయింది. గేటును ఎప్పుడూ మూసి ఉంచతుండటంతో ఎవ్వరు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ప్రకృతి వనం బోర్డు కనిపించకుండ చెట్ల కొమ్మలు పెరిగినా ఇటుగా చూసే వారు లేరు. సంబంధిత అధికారులు స్పందించి ప్రకృతి వనాలపై దృష్టి పెట్టాలని స్థానికులు కోరుతున్నారు.