హైదరాబాద్, మార్చి 10 (నమస్తే తెలంగాణ): ఎన్నికలకు ముందు ఆటో మోటర్ రవాణా కార్మికులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీల ను అమలు చేయాలని బీఆర్ఎస్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్, మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆశా వరర్ల సమస్యలను వెంటనే తీర్చాలని డిమాండ్ చేశారు. వచ్చే బడ్జెట్ సమావేశాల్లో ఆయా అంశాలపై సర్కార్‌పై బీఆర్ఎస్ పార్టీ ఒత్తిడి తీసుకొస్తుందని స్పష్టంచేశారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో మంగళవారం బీఆర్టీయూ ట్రేడ్ యూనియన్ కమిటీ సమావేశంలో వారు మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో వివిధ రంగాల కార్మికుల సంక్షేమానికి ఇచ్చిన అనేక హామీలు నేటికీ అమలు కాలేదని వినోద్‌కుమార్ విమర్శించారు. బీడీ కార్మికులు, అసంఘటితరంగ కార్మికులు, స్ట్రీట్ వెండర్లు, ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు సహా వివిధ వర్గాలకు సంక్షేమ బోర్డులు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినా, ఇప్పటివరకు కాంగ్రెస్ సర్కార్ చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. కార్మిక సంక్షేమ హామీలపై సమగ్ర వివరాలతో కూడిన నివేదికను సిద్ధం చేసి, శాసనసభలో చర్చకు పట్టుబడతామని తెలిపారు. ఆశావర్కర్ల అంశంపై ఆరోగ్యశాఖ మాజీ మంత్రి హరీశ్‌రావుతో మాట్లాడి, శాసనసభలో చర్చకు తేవాలని నిర్ణయించినట్టు తెలిపారు.
కార్మికులకు భారంగా లేబర్ కోడ్లు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొత్తగా తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లు కార్మికులకు భారంగా మారాయని మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ ఆందోళన వ్యక్తంచేశారు. వాటిని సవరించి కార్మికుల అభ్యున్నతికి అనుకూలంగా మార్చాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ఎప్పుడూ కార్మికుల పక్షానే నిలుస్తుందని, వారి హక్కులు, భద్రత, భవిష్యత్తు కోసం పోరాడుతుందని తెలిపారు. రాష్ట్రంలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్టీయూ పోరాడాలని పిలుపునిచ్చారు. సమావేశంలో బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రాంబాబు యాదవ్, వేముల మారయ్య, యూనియన్ నాయకులు పీ నారాయణ, కృష్ణ, హమాలీ శ్రీను, గుర్రం వెంకట్‌రెడ్డి, ఆశావర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు సంతోషివాణి, బీఆర్టీయూ రాష్ట్ర కార్యదర్శి యాదగిరి యాదవ్, నాయకులు సిరివెళ్ల ప్రభాకర్, శ్రీనివాసరెడ్డి, సంజీవ్ యువరాజ్ తదితరులు పాల్గొన్నారు.