సంగారెడ్డి, జనవరి 28 (నమస్తే తెలంగాణ)/న్యాల్కల్/రాయికోడ్ : ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావు వచ్చే నెల మొదటి వారంలో సంగారెడ్డి జిల్లాలో పర్యటించే అవకాశమున్నది. ఇటీవల జిల్లా మంత్రి హరీశ్‌రావు, జిల్లా ఎమ్మెల్యేలు సీఎం కేసీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లాలో పర్యటించాలని కోరా రు. ఇందుకు సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందిస్తూ వచ్చే నెలలో సంగారెడ్డి జిల్లాలో పర్యటిస్తానని హామీ ఇచ్చారు. దీంతో సీఎం కేసీఆర్ జిల్లా పర్యటనకు సం బంధించిన కార్యక్రమాల రూపకల్పన వేగంగా జరుగుతున్నాయి. ఫిబ్రవరి 2 నుంచి 10వ తేదీలోపు సీఎం కేసీఆర్ సంగారెడ్డి జిల్లా పర్యటన ఉండే అవకాశాలు ఉన్నాయి. సీఎం కేసీఆర్ పర్యటనకు సంబంధించి ఏ ర్పాట్లపై ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి హరీశ్‌రా వు దృష్టి సారించారు. మంత్రి ఆదేశాల మేరకు టీఆర్ఎస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్, అం దోలు, జహీరాబాద్ ఎమ్మెల్యేలు చంటి క్రాంతికిరణ్, మాణిక్‌రావు, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ తదితరులు శుక్రవారం రాయికోడ్, న్యాల్కల్ మండలాల్లో సీఎం కేసీఆర్ బహిరంగ సమావేశ స్థలాలను పరిశీలించారు. ఈ నేపథ్యంలో ఆదివారం మంత్రి హరీశ్‌రావు జహీరాబాద్ నియోజవర్గంలో పర్యటించనున్నారు. సీఎం పర్యటన కార్యక్రమాలపై ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులతో చర్చించనున్నారు.
ప్రజలు, ప్రజాప్రతినిధుల్లో ఆసక్తి
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన కోసం ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులతోపాటు జిల్లా ప్ర జలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సీఎం కేసీఆర్ చే తుల మీదుగా తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి పను లు ప్రారంభింపజేసుకోవాలని ఎమ్మెల్యేలు కొద్దిరోజులుగా భావిస్తున్నారు. సీఎం కేసీఆర్ చేతుల మీదు గా సంగారెడ్డి జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జరగాల్సి ఉంది. సీఎం కేసీఆర్ తమ నియోజకవర్గాల్లో పర్యటిస్తే పనులు ప్రారంభించడంతోపాటు నిధులు మంజూరు చేస్తారని ఎమ్మెల్యేలు అనుకుంటున్నారు.
మొదట పటాన్చెరు నియోజకవర్గంలో..
సీఎం కేసీఆర్ పర్యటన మొదట పటాన్చెరు నియోజకవర్గంలో ఉండే అవకాశముంది. పటాన్చెరు నియోజకవర్గం రామచంద్రాపురం మండలం కొల్లూరులో పేదల కోసం ప్రభుత్వం రూ.1422.15 కోట్ల టౌన్షిప్ నిర్మించింది. టౌన్షిప్లో 9 నుంచి 11 అంతస్తుల నిర్మాణాలతో మొత్తం 15,600 డబుల్‌బెడ్‌రూ మ్ ఇండ్లను నిర్మించారు. జిల్లా పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ కొల్లూర్ టౌన్ షిప్‌ను ప్రారంభించి పేదలకు ఇండ్లు అందజేయనున్నారు. అలాగే పటాన్‌చెరుకు సీఎం కేసీఆర్ రూ.300 కోట్లతో సూపర్‌స్పెషాలిటీ దవాఖాన మంజూరు చేయగా, దానికి శంకుస్థాపన చేసే అవకాశాలున్నాయి. వీటితోపాటు పటాన్చెరు నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులను సీఎం కేసీఆర్ ప్రారంభించే చాన్స్ ఉంది. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి సీఎం కేసీఆర్ పర్యటన విషయమై మంత్రి హరీశ్‌రావుతో శుక్రవారం చర్చించారు.
మెడికల్ కాలేజీ, సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతలకు శంకుస్థాపన
సంగారెడ్డి, జహీరాబాద్, అందోల్ నియోజకవర్గాల్లో సీఎం కేసీఆర్ పర్యటన ఉంటుందని టీఆర్ఎస్ వర్గాల చెబుతున్నాయి. సీఎం కేసీఆర్ గత ఎన్నికల హామీ మేరకు సంగారెడ్డికి మెడికల్ కాలేజీ మంజూరు చేయగా, రూ.500కోట్లతో ప్రస్తుతం పనులు కొనసాగుతున్నాయి. వచ్చే విద్యా సంవత్సరం నుంచి 150 సీట్లతో మెడికల్ కాలేజీ ప్రారంభం కానునున్న నేపథ్యంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీకి సీఎం కేసీఆర్ తన పర్యటనలో శంకుస్థాపన చేయనున్నారు. కంది సమీపంలో నిర్మించిన టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయ భవనాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించే అవకాశముంది. సుమారు రూ.5వేల కోట్లతో సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు సీఎం కేసీఆర్ ప్రకటించగా, టెండర్ల ప్రక్రియ పూర్తయ్యి, నిర్మాణం కోసం కార్పొరేషన్ ఏర్పాటుకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. సంగమేశ్వర ఎత్తిపోతల పథకం ద్వారా జహీరాబాద్, సంగారెడ్డి, అందోలు నియోజకవర్గాల్లో 3.86 లక్షల ఎకరాలకు, బసవేశ్వర ఎత్తిపోతల ద్వారా నారాయణఖేడ్, అందోలు నియోజకవర్గాల్లో 1.65 లక్షల ఎకరాలకు సాగునీరు అందనున్నది. ఈ ఎత్తిపోతలను సీఎం చేతుల మీదుగా శంకుస్థాపన చేయించనున్నారు. అక్కడే బహిరంగ సభ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఇందుకోసం శుక్రవారం టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్, అందోలు, జహీరాబాద్ ఎమ్మెల్యేలు క్రాంతికిరణ్, మాణిక్‌రావు, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ రాయికోడ్ చౌరస్తా, జంబ్గి, కంకోల్, హద్నూర్లో స్థలాలను స్థలాలను పరిశీలించారు. తాము పరిశీలించిన స్థలాలకు సంబంధించిన వివరాలను మంత్రి హరీశ్‌రావుకు తెలియజేశారు. సీఎం పర్యటన, సభా నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై మంత్రి హరీశ్‌రావు ఆదివారం జిల్లా నాయకులతో చర్చించనున్నారు.
కేతకి సంగమేశ్వర స్వామిని సందర్శించాలని ముఖ్యమంత్రికి వినతి
వచ్చే నెల మొదటి వారంలో సంగారెడ్డి జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించే అవకాశం ఉండడంతో ముఖ్యమంత్రిని డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ శుక్రవారం హైదరాబాద్‌లోని ప్రగతి భవన్లో కలిశారు. జిల్లా పర్యటన సందర్భంగా ఝరాసంగంలోని కేతకి సంగమేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించాలని కోరారు. ఆలయంలో ప్రతీ సోమవారం సీఎం కేసీఆర్ పేరిట అభిషేకం, అర్చనలు చేస్తున్నట్లు తెలిపారు. తన వినతిపై సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారని డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ తెలిపారు.