హైదరాబాద్, మార్చి 1 (నమస్తే తెలంగాణ): విద్యా కమిషన్ నివేదిక, సిఫారసులు ఇప్పటికే వివాదాస్పదం కాగా, తాజాగా కమిషన్ సభ్యుడు ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వర్రావు చేసిన వ్యాఖ్యలు మరో వివాదానికి తెరలేపాయి. ఎన్జీవోలకు, స్వచ్ఛంద సంస్థలకు మంచి వేతనాలు, చెల్లింపులు చేయాలన్న ఉద్దేశంతోనే విద్యారంగం బడ్జెట్‌ను 18 శాతానికి పెంచాలని సిఫారసు చేసినట్టు పీఎల్ విశ్వేశ్వర్రావు తెలిపారు.. ఆదివారం ఆయన ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం విద్యారంగానికి 8% కంటే తక్కువ కేటాయింపులున్నాయి. వీటిని 18 శాతానికి పెంచాలని సూచించాం. ఎందుకంటే, టీచర్లు, ఎన్జీవోలు, స్వచ్ఛంద సంస్థలకు మంచి చెల్లింపులు చేయాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచాలి. ఆట స్థలాలు, ల్యాబ్‌లు, డిజిటల్ లైబ్రరీలు ఏర్పాటు చేయాలి. అందుకు బడ్జెట్లో 18% ఇవ్వాలని సూచించాం. ముఖ్యమంత్రిని అడిగాం. 18% ఎందుకు అడిగామో కారణాలను సైతం వివరించాం’ అని పేర్కొన్నారు.
సర్కార్‌కు సమర్పించిన నివేదికలో విద్యాకమిషన్ ఎన్జీవోల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించింది. ఐక్యరాజ్యసమితి ఏజెన్సీలతోపాటు జాతీయ, అంతర్జాతీయ స్థాయి ఎన్జీవోలు విద్యారంగంలో చురుకుగా పనిచేస్తున్నాయి. పాఠశాలల్లో ఎన్జీవోల జోక్యాన్ని సులభతరం చేయాలని, ఇందుకు ప్రభుత్వ విద్యా విభాగాల్లో ఒక నోడల్ ఏజెన్సీని ఏర్పాటుచేయాలని కమిషన్ సిఫారసు చేసింది. అయితే, విద్యా కమిషన్ ఎన్జీవోలను ప్రోత్సహించాలని, జోక్యాన్ని మరింత సులభతరం చేయాలని సూచించడం, తాజాగా ఎన్జీవోలకు చెల్లింపులు చేయాలనడం, ఇందుకు రాష్ట్ర బడ్జెట్లో నిధులు కేటాయించాలనడంపై టీచర్లు, ఉపాధ్యాయ సంఘాలు భగ్గుమంటున్నాయి.
విద్యా కమిషన్ నివేదిక, సిఫారసులు ఇప్పటికే వివాదాస్పదమయ్యాయి. కమిషన్ తీరుపై అన్ని వర్గాలు భగ్గుమంటున్నాయి. టీచర్లకు జీతాలు ఎక్కువ ఉన్నాయని, వాటిని తగ్గించి స్కూళ్లల్లో మౌలిక వసతులు కల్పించాలని కమిషన్ సూచించడంతో టీచర్లు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఉపాధ్యాయులకు ప్రమోషన్లు రద్దుచేయాలనడం, ఫెర్ఫార్మెన్ ప్రాతిపదికన వారిని కొనసాగించాలనడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు. టీచర్ల బదిలీలు చేపట్టవద్దని, హెచ్ఎం పోస్టులను వందశాతం డైరెక్ట్‌గా నియమించాలనడం, 45 ఏండ్లలోపు వారు మాత్రమే అర్హులని సిఫారసు చేయడాన్ని తప్పుపడుతున్నాయి. ఎప్‌సెట్‌ను రద్దు చేయాలన్న సూచనను విద్యార్థి సంఘాలు తప్పుబడుతున్నాయి. కొత్త టీచర్లను కాంట్రాక్ట్ పద్ధతిలోనే తీసుకోవాలన్న సూచనను నిరుద్యోగులు వ్యతిరేకిస్తున్నారు. ఎన్జీవోలకు చెల్లింపులు చేయాలనడం ద్వారా విద్యా కమిషన్ మరో వివాదానికి కేంద్రబిందువైంది.