అది ఏడో శతాబ్దం. ఓ రోజు మదీనా నగరంలో సూర్యుడు అస్తమిస్తూ ఆకాశాన్ని ఊదా, బంగారు రంగులతో ముంచెత్తుతున్న వేళ.. అక్కడ ఒక నిశ్శబ్ద విప్లవం మొదలైంది. ఒక సామాన్యమైన ఇంట్లో దీపం వెలిగింది. ఆ ఇంట్లో ఆకలి లేదు, రేపటి గురించిన ఆందోళన లేదు, నిరాశ అంతకన్నా లేదు. ఇది కేవలం ఒక వ్యక్తి అదృష్టం కాదు; ఏ పౌరుడూ ఆకలితో నిద్రపోకూడదని నిర్ధారించే ఒక విప్లవాత్మక సామాజిక-ఆర్థిక ఒప్పందం ఫలితం. ఆ వ్యవస్థ పేరే.. జకాత్. నేడు, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అసమానతలు పతాక స్థాయికి చేరుకున్న తరుణంలో, ఖురాన్ సూచించిన ఈ ఆర్థిక సూత్రం మళ్లీ చర్చనీయాంశమవుతున్నది. ఇది కేవలం ఒక మతపరమైన ఆచారం మాత్రమే కాదు; మూలధన ప్రవాహానికి, పేదరిక నిర్మూలనకు అత్యాధునిక ప్రణాళిక.
విశ్వాసపు ఆర్థిక శాస్త్రం : జకాత్ నిలిచిపోయిన మూలధనాన్ని లక్ష్యంగా చేసుకుంటుంది. ‘నిసాబ్’ అంటే 85 గ్రాముల బంగారం (సుమారు 6.6 లక్షలు) అనే పరిమితిని మించి, ఒక ఏడాది పాటు నిల్వ ఉన్న అదనపు ఆస్తులపై మాత్రమే ఈ 2.5 శాతం విధి వర్తిస్తుంది. ఆర్థికంగా చూస్తే, ఈ విధానం అద్భుతమైనది. నగదు, బంగారం, వ్యాపార నిల్వలపై ఈ రుసుమును విధించడం ద్వారా, సంపదను దాచిపెట్టడాన్ని ఇది నిరుత్సాహపరుస్తుంది. సంపద అనేది కొందరి లాకర్లలో మూలుగుతూ ఉండకుండా, సమాజంలో ప్రవహించే ఒక ‘సజీవ’ శక్తిగా ఉండేలా ఇది నిర్ధారిస్తుంది. మదీనా నమూనా- చారిత్రక విజయగాథ పేదరికం అనేది ఒక వ్యక్తి వైఫల్యం కాదు, అది సమాజం ఉమ్మడి బాధ్యత అని ప్రవక్త ముహమ్మద్ (స.అ.వ) ఉద్ఘాటించారు. ‘ఒక పట్టణంలో ఒక్క వ్యక్తి ఆకలితో నిద్రపోతే, ఆ పట్టణం మీద దైవ రక్షణ తొలగిపోతుంది’ అన్న ఆయన హెచ్చరిక అత్యంత లోతైనది. ఇది కేవలం మాటలకే పరిమితం కాలేదు. ఖలీఫా ఉమర్ (రజి) పరిపాలనలో జకాత్ అమలు ఎంత ప్రభావవంతంగా సాగిందంటే, ‘జకాత్ తీసుకోవడానికి అర్హులైన పేదలెవరా?’ అని అధికారులు వెతకాల్సిన పరిస్థితి ఏర్పడిందట. అంటే, సంపన్నుడి ‘దానం’ పేదవాడిని ‘స్వయం సమృద్ధి’ వైపు నడిపించింది. మానవ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన పేదరిక నిర్మూలన కార్యక్రమంగా ఇది నిలిచిపోయింది.
మనం యజమానులం కాదు, పరిరక్షకులం. జకాత్ తాత్విక పునాది ‘యజమాని’ అనే భావననే సవాలు చేస్తుంది. మనం సంపదకు యజమానులం కాదు, కేవలం పరిరక్షకులం మాత్రమే అని ఇది చెబుతుంది. భూమిపై ఉన్న వనరులన్నీ ఒక ‘అమానతు’. ఆకలి లేని ప్రపంచం అనేది కేవలం చరిత్ర పుస్తకాల్లో ఉండే కల కాదు; అది ఒక గణిత సాధ్యం. ఖురాన్ సూచించిన 2.5% నిబంధనను ఆధునిక వ్యవస్థాగత సామర్థ్యంతో కలిపి అమలు చేస్తే, గౌరవం, కరుణ, నిజమైన సామాజిక న్యాయంతో కూడిన ప్రపంచ ఆర్థిక వ్యవస్థను నిర్మించవచ్చు.