తాండూరు, ఆగస్టు 14 : ఎరువు కోసం రైతన్న రోడ్డెక్కాడు. శుక్రవారం తాండూరు-సంగారెడ్డి మార్గంలోని పెద్దేముల్ మండల కేంద్రంలో రాస్తారోకో నిర్వహించి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం 11 గంటల నుంచి రైతులు ప్రధాన రోడ్డుపై గంటపాటు రాస్తారోకో చేయడంతో ఎక్కడి వాహనాలు అక్క డే ఆగిపోయాయి. మార్కెట్లో డీఏపీ దొరక్క ఇబ్బందిపడుతుంటే.. సర్కార్ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నదని దుయ్యబట్టారు. పెద్దేముల్ మండల కేంద్రంలోని ఎఫ్ఏసీఎస్(ఫార్మర్ కో-ఆపరేటివ్ సొసైటీ)లో శుక్రవారం 500 యూరియా బస్తాలను పంపిణీ చేస్తామని అక్కడి సిబ్బంది చెప్పారు.
ఉదయం 10 గంటల నుంచి కొత్తగా రూపొందించిన యాప్లో రైతులు తమ వివరాలను నమోదు చేసుకోవాలని సూ చించారు. రైతులు ఆ యాప్లో బుక్ చేసుకునేందుకు ఎంత యత్నించినా బుక్ కాలేదు. సాంకేతిక లోపంతో ఆటంకమైంది. ఉదయం 10 గంటల 55 నిమిషాలకు మరోసారి బుక్ చేసేందుకు యత్నించగా యాప్లో యూరియా స్టాక్ లేదని చూపించడంతో ఎఫ్ఏసీఎస్ ఆవరణలో ఉన్న రైతులు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. అక్కడి సిబ్బందిని ప్రశ్నించగా స్టాక్ నిల్ చూపడంతో తాము ఏమి చేయలేమని మండలంలోని ఇతర రైతులు (తట్టెపల్లి సొసైటీ) యారియాను బుక్ చేసుకుని ఉండొచ్చునని తాపీగా సమాధానం ఇవ్వడంతో వందలాది రైతుల్లో ఒక్కసారిగా ఆగ్రహం పెల్లుబికింది. సొసైటీ ఆవరణలో ఉన్న కొందరికే యూరియా బుకింగ్ కాగా 90 శాతం మందికి బుక్ కాకపోవడంతో వారు ఆగ్రహంతో ఊగిపోయారు.
వరి, పత్తి, కంది పంటలకు అదునుకు యూరియా వేయకుంటే దిగుబడి తగ్గే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. ఒకవైపు డీఏపీ మార్కెట్లో లభించక.. నెల రోజులు దాటినా యూరియాకూ కొర్రీ లు పెట్టడంతో రైతులు ప్రభుత్వ వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పెద్దేముల్ సొసైటీలో సిబ్బంది ఉన్నా తాళం వేసి తమ నిరసన తెలిపారు. పోలీసులు వచ్చి తాళం తీయించే వరకు దాదాపుగా గంట వరకు సిబ్బంది ఆ భవనంలోనే ఉండిపోయారు. కాగా, వ్యవసాయ శాఖ కొత్తగా తీసు కొచ్చిన యాప్ విధానం బాగాలేని రైతులు పేర్కొంటున్నారు. గతంలో మాదిరిగానే ఆధార్ ద్వారా ఎరువులను పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.