అందోల్, ఆగస్టు 14: సంగారెడ్డి జిల్లాకు సీఎం రేవంత్‌రెడ్డి రెండోసారి వస్తున్న సందర్భంగా గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, అందోల్ నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ డిమాండ్ చేశారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా అందోల్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన సీఎం రేవంత్‌రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం చెప్పే మాటలకు చేసే పనులకు పొంతన లేదని విమర్శించారు. గతంలో జహీరాబాద్ పర్యటనకు వచ్చిన సందర్భంగా ఇచ్చిన హామీలే నెరవేర్చలేదని ఎద్దేవా చేశారు.
కేసీఆర్ హయాంలో జిల్లా పర్యటన సందర్భంగా వందల కోట్ల నిధులు మంజూరయ్యేవని, కానీ ఇప్పుడు జిల్లా నుంచి మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నా నిధులు విడుదల రాక ఎక్కడి అభివృద్ధి అక్కడే నిలిచిపోయిందన్నారు. నియోజకవర్గంలో ఎక్కడ చూసినా రోడ్లు అధ్వానంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల సింగూర్ జలాశయం డెట్ స్టోరేజీకి వెళ్లిందని మండిపడ్డారు. వర్షాకాలంలో కాల్వల మరమ్మతు పేరుతో నీటిని వృథాచేసి రైతులకు సాగునీటి కష్టాలు, ప్రజలకు తాగునీటి కష్టాలు సృష్టించారన్నారు. పుల్కల్లో నిర్మించిన దవాఖాన భవనం ప్రారంభించాలన్నారు. కంకోల్, పుల్కల్ గ్రామాల్లో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను వెంటనే అర్హులకు కేటాయించాలన్నారు.
అందోల్ మం డల పరిధిలో రైతులకు పట్టాలు వెంటనే అందజేసి చిత్తశుద్ధి నిరూపించుకోవాలన్నారు. వర్షం వస్తే నియోజకవర్గంలోని రోడ్లపై వెళ్లలేని పరిస్థితి ఉన్నదన్నారు. నియోజకవర్గంలో ఇసుక రవాణా, అక్రమ మైనింగ్ అరికట్టాలన్నారు. బసవేశ్వర-సంగమేశ్వర ఎత్తిపోతల పథకాన్ని పునరుద్ధరించాలని, కాళేశ్వరం ద్వారా అందోల్, అల్లాదుర్గం, టేక్మాల్ మండలాలకు సాగునీరందించే పథకాలను వేగవంతం చేయాలన్నారు. సమావేశంలో మాజీ ఏఎంసీ చైర్మన్లు నారాయణ, నాగభూషణం, సర్పంచ్ అనిల్‌రెడ్డి, కౌన్సిలర్ నాగరత్నంగౌడ్, నాయకులు విజయ్‌కుమార్, వీరేందర్, చాపల వెంకటేశం, జిన్న విజయ్, ఇమ్రాన్‌ఖాన్, రఫిక్ పాల్గొన్నారు.