నిజాంపేట్ జూలై 28 : మండల పరిధిలోని బాచేపల్లి గ్రామంలో రోడ్డు భద్రతపై వాహన చోదకులకు అవగాహన కల్పించారు కల్హేర్ ఎస్సై మధుసూదన్ రెడ్డి (Madhusudhan Reddy). సంగారెడ్డి- నాందేడ్ అకోలా జాతీయ రహదారి 161 భద్రత వారు ప్రమాదాల నియంత్రణ అధికారి మొహీనుద్దీన్ ఆధ్వర్యంలో సీహెచ్ నంబర్ 74 ప్లస్ 400 ఎల్ హెచ్ ఎస్ హైవేపై ప్రయాణించేవాళ్లకు ఎస్సై మధుసూదన్ రెడ్డి ట్రాఫిక్ భద్రత సూచనలు చేశారు. IMS బృందం నిర్వహించిన రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమంలో భాగంగా Ch.no-74+400 LHS హైవే పై కరపత్రాలను పంపిణీ చేశారు.
మోటార్ సైకిల్‌పై ప్రయాణిస్తున్నప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని ఎస్సై సూచించారు. కారులో ప్రయాణించేటప్పుడు సీటు బెల్ట్ పెట్టుకోవాలని, పాదచారులు జీబ్రా క్రాసింగ్ వద్ద రోడ్డు దాటాలని ఆయన తెలిపారు. అంతేకాదు పాదచారులు ఎల్లప్పుడూ రోడ్డుకు ఎడమ వైపు మాత్రమే నడవాలని.. మద్యం సేవించి హైవేపైకి రాకూడదనీ ఎస్సై భద్రతా విషయాలను వివరించారు. నిషేధిత ప్రాంతాల్లో (సర్వీస్ రోడ్డు, బస్ షెల్టర్, ధాబాలు) వాహనాలను పార్క్ చేయవద్దని ఆయన
గ్రామస్తులను కోరారు. సర్వీస్ రోడ్లో ప్రయాణించేటప్పుడు గంటలకు 40 కి.మీ వేగంతో మాత్రమే ప్రయాణించాలని ఎస్సై మధుసూదన్ స్పష్టంగా చెప్పారు.
గ్రామస్తులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తున్న ఎస్సై
డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవారు మాత్రమే వాహనం నడపాలని, తప్పుడు దిశలో బండి నడపొద్దని చెప్పిన ఆయన.. మోటార్ సైకిల్‌పై త్రిబుల్ రైడింగ్ చేయొద్దని సూచన చేశారు. అంతేకాదు మద్యం సేవించి వాహనం నడపడం.. వాహనం నడిపే సమయంలో మొబైల్ ఫోన్ ఉపయోగించడం సరికాదని హితవు పలికారు ఎస్సై. అలానే.. పశువులను రోడ్డు పక్కన వదిలివేయకూడదని గ్రామస్తులకు ఎస్సై సూచించారు.
టూ వీలర్, కార్లను మైనర్లకు ఇచ్చినచో వాహన యజమానిపై కేసు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు లేదా అత్యవసర సమయంలో కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేయాలని ఎస్సై చెప్పారు. ఎమర్జెన్సీ టైమ్‌లో 8712691645, RPV-1: 8712691643, RPV-2: 8712691644, అంబులెన్స్-1: 8712691641 అంబులెన్స్-2: 8712691642 NHAI హెల్ప్‌లైన్ టోల్ ఫ్రీ:1033 నంబర్లకు వెంటనే కాల్ చేయాలని గ్రామస్తులను కోరారు ఎస్సై. ఈ కార్యక్రమంలో CRI జీవన్, CRO రాజుగౌడ్, హైవే పెట్రోలింగ్ సిబ్బంది, అంబులెన్స్ సిబ్బంది పాల్గొన్నారు.