Bhopal Sisters : బలవంతపు మత మార్పిడులు, సెక్స్ రాకెట్ నిర్వహణ వంటి పలు నేరాలకు పాల్పడుతున్న భోపాల్ సిస్టర్స్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఉద్యోగాల కోసం వచ్చే అమాయక యువతులను వేధిస్తూ, నేరాలకు పాల్పడుతున్న సిస్టర్స్‌ను అరెస్టు చేయగా, వారి ముఠా కోసం పోలీసులు గాలిస్తున్నారు. అరెస్టైన వారిని అమ్రీన్, అఫ్రీన్, వారి అనుచరుడు చందన్ యాదవ్‌గా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్, భోపాల్‌లోని అబ్బాస్ నగర్లో అమ్రీన్, అఫ్రీన్ అనే అక్కా చెల్లెళ్లు స్థానిక మురికి వాడలో జీవించే వారు. వారిది పేద కుటుంబం.
అయితే, ఇటీవల ఈ సిస్టర్స్ ఇద్దరూ భోపాల్‌లోని సాగర్ రాయల్ విల్లాస్లోని ఒక ఖరీదైన విల్లాలోకి మారారు. ఆర్థికంగా ఈ మార్పునకు కారణం వారు చేసిన నేరాలే. ఈ ఇద్దరిపై ఇటీవల ఇద్దరు మహిళలు వేర్వురుగా బాగ్ సెవానియా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రెండు ఫిర్యాదుల్ని పరిశీలించగా ఇద్దరు సిస్టర్స్‌పై, ఒకే తరహా నేరంపై ఉన్నాయి. దీంతో పోలీసులు ఈ కేసును ప్రత్యేకంగా తీసుకున్నారు. అమ్రీన్, అఫ్రీన్ సిస్టర్స్‌కు చందన్ యాదవ్ అనే యువకుడు తోడుగా ఉండేవాడు. ఈ ముగ్గురితోపాటు బిలాల్, చాను, యాసిర్ అనే ముగ్గురు కూడా ఒక ముఠాగా నేరాలకు పాల్పడ్డారు. ఒకటీ, రెండూ కాదు.. వీరు అనేక నేరాలకు పాల్పడ్డారు. పేద, హిందూ యువతులే వీరి లక్ష్యం. పేద యువతులకు ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించేవారు. తర్వాత వారిని డబ్బు పేరుతో ప్రలోభపెట్టి ధనవంతుల ఇండ్లకు, పబ్బులు, పార్టీలకు పంపించేవారు. అక్కడ అన్ని రకాల పనులు చేయించేవారు.
అలాగే ఈ యువతులకు డ్రగ్స్ ఇచ్చి, వీరిపై అత్యాచారం, లైంగిక దాడులకు పాల్పడేవారు. అనంతరం వాటిని వీడియోలు, ఫొటోలు తీసి బెదిరించేవారు. ఇలా పలువురు ఈ సిస్టర్స్ అండ్ గ్యాంగ్ వలలో చిక్కుకున్నారు. అమ్మాయిల్ని లైంగికంగా వేధించడం, వీరితో సెక్స్ రాకెట్ నిర్వహించడంతోపాటు హిందూ యువతుల్ని బలవంతంగా ముస్లిం మతంలోకి మార్పించేవారు. ఇలా వారి చేతిలో బలైన వారిలో ఇద్దరు యువతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒక యువతి ఫిర్యాదు ప్రకారం.. బ్యూటీషియన్ పని చేసే ఆమెను ఉపాధి కల్పిస్తానని వీరి గ్యాంగ్ 2025 డిసెంబర్లో అహ్మదాబాద్ తీసుకెళ్లింది. అక్కడ అమ్రీన్ బంధువైన యాసిర్ ఆమెపై అత్యాచారం చేశాడు. తర్వాత బిలాల్, చాను అనే మరో ఇద్దరు కూడా దాడి చేశారు. భోపాల్‌కు చెందిన మరో యువతి అమ్రీన్ ఇంట్లో పని చేసేది. ఆమెపై చందన్ యాదవ్ అత్యాచారం చేశాడు. అలాగే ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని వారంతా ఆమెను బెదిరించారు. అలాగే ఇస్లాంలోకి మారాలని కూడా బలవంతం చేశారు.
ఇస్లాంలోకి మారితే ధనవంతుడైన వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేస్తానని చెప్పాడు. ఈ రెండు ఘటనలపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు అమ్రీన్, అఫ్రీన్, చందన్‌ను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మిగతా నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. వీరి ఆర్థిక లావాదేవీలు, డిజిటల్, సోషల్ మీడియా కార్యకలాపాలపై ఆరా తీస్తున్నారు.