Harish rao | పటాన్ చెరు, డిసెంబర్ 8 : సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సోమవారం పటాన్చెరు బీఆర్ఎస్ నియోజకవర్గ ఇంచార్జ్ ఆదర్శ్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, కీలక నాయకులు భారీ సంఖ్యలో బీఆర్ఎస్ గూటికి చేరారు.
హైదరాబాద్లోని మాజీ మంత్రి హరీష్ రావు నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన గుమ్మడిదల మండల మాజీ జెడ్పీటీసీ కుమార్, గుమ్మడిదల మండల ఎంపీపీ ప్రవీణ విజయభాస్కర్ రెడ్డి, గుమ్మడిదల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు హుస్సేన్ లతో పాటు సుమారు 50 మంది నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి హరీష్ రావు గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో పటాన్ చెరు నియోజకవర్గం బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ప్రభాకర్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు.
ఆడబిడ్డలు మీ మోసాన్ని గమనిస్తున్నారు..
ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. ఎన్నికల ముందు 420 హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను మోసం చేశారు. మేనిఫెస్టోలో పెట్టిన ఏ ఒక్క హామీని కూడా అమలు చేయడం లేదు. ఆరు గ్యారెంటీలు అటకెక్కాయన్నారు. ప్రతీ మహిళకు నెలకు రూ. 2,500 ఇస్తామని చెప్పిన మహాలక్ష్మి పథకం ఏమైంది..? 12 నెలల బకాయిలు కలిపి ఒక్కో మహిళకు ప్రభుత్వం రూ. 60,000 బాకీ పడింది. ఆడబిడ్డలు మీ మోసాన్ని గమనిస్తున్నారు. చేయూత కింద వృద్ధులకు 4,000 పెన్షన్ ఇస్తామని చెప్పి, ఓట్లు వేయించుకొని ఇప్పుడు ముఖం చాటేశారు.
కేసీఆర్ రైతుబంధును పండగలా ఇస్తే.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం దాన్ని దండగలా మార్చింది. రెండు సీజన్ల రైతుబంధు ఎగ్గొట్టి రైతులను అప్పుల ఊబిలోకి నెట్టారు. నాడు దేశానికి ఆదర్శంగా నిలిచిన తెలంగాణ పల్లెలు, నేడు కాంగ్రెస్ పాలనలో వెలవెలబోతున్నాయి. జాతీయ స్థాయి అవార్డుల్లో సగానికి పైగా తెలంగాణకే వచ్చేవి. కానీ ఇప్పుడు కనీస నిర్వహణ లేక గ్రామాలు అస్తవ్యస్తంగా మారాయి.
గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయకుండా ప్రభుత్వం చేతులెత్తేసింది. ట్రాక్టర్లలో డీజిల్ పోయించడానికి, కాలిపోయిన వీధి లైట్లు మార్చడానికి కూడా సర్పంచుల దగ్గర, అధికారుల దగ్గర చిల్లిగవ్వ లేదు. గ్రామాభివృద్ధి చేసిన సర్పంచులు, కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకుండా ప్రభుత్వం వేధిస్తోంది. చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేక వారు ఆత్మహత్యల బాట పడుతున్నారు.
అప్పులు తెచ్చి గ్రామాలను నడపలేక..
పంచాయతీ కార్యదర్శుల పరిస్థితి దయనీయంగా మారింది. నిధులు ఇవ్వరు కానీ పనులు జరగాలంటారు. అప్పులు తెచ్చి గ్రామాలను నడపలేక వారు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. పారిశుధ్యం పడకేసింది. మిషన్ భగీరథ నీళ్లు రాక మళ్లీ బిందెలు పట్టుకుని రోడ్ల మీదకు వచ్చే పరిస్థితి తెచ్చారు. గ్రామాల ఆత్మగౌరవాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మంటగలిపింది.
ఇదే నిర్లక్ష్యం కొనసాగితే గ్రామ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంపై తిరగబడాలి. ఓట్లతో బుద్ధి చెప్పాలి. మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. అందరం కలిసికట్టుగా పని చేద్దాం కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుచుదామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ItsOkayGuru | ‘ఇట్స్ ఓకే గురు’ తప్పకుండా అందరినీ అలరిస్తుంది : మెహర్ రమేష్
Hyderabad | అంత్యక్రియలకు డబ్బుల్లేక మృతదేహంతో మూడు రోజులు
ICC | భారత క్రికెటర్లకు షాకిచ్చిన ఐసీసీ.. మ్యాచ్ ఫీజులో భారీ కోత..!