ICC : విశాఖ వన్డేలో అదిరే విజయంతో సిరీస్ గెలుపొందిన టీమిండియా భారీ షాక్. స్లో ఓవర్ రేటు కారణంగా భారత జట్టుపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) భారీ జరిమానా విధించింది. సిరీస్‌లో రెండోదైన రాయ్‌పూర్ వన్డే (Raipur ODI)లో నిర్ణీత సమయంలోపు ఓవర్లు పూర్తి చేయనుందన.. భారత క్రికెటర్ల మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధించింది ఐసీసీ. ఈ విషయాన్ని సోమవారం ఐసీసీ వెల్లడించింది.
స్వదేశంలో దక్షిణాఫ్రికాకు టెస్టు సిరీస్ సమర్పించుకున్న భారత జట్టు వన్డేల్లో మాత్రం పంజా విసిరింది. రాంచీ వన్డేలో ఉత్కంఠ విజయంతో సిరీస్‌లో బోణీ కొట్టిన టీమిండియా.. విరాట్ కోహ్లీ(105), రుతురాజ్ గైక్వాడ్(102) శతకాల మోతతో రాయ్‌పూర్‌లోనూ ప్రత్యర్ధికి పెద్ద లక్ష్యాన్ని నిర్దేశించింది. 359 పరుగుల రికార్డు లక్ష్యాన్ని సఫారీ టీమ్ మరో నాలుగు బంతులు ఉండగానే అందుకుని సిరీస్ సమం చేసింది. అయితే.. ఈ మ్యాచ్‌లో టీమిండియా 2 ఓవర్లు వెనకబడింది. ఈ విషయాన్ని గుర్తించిన రిఫరీ రిచీ రిచర్డ్సన్ (Richie Richardson) ఐసీసీ దృష్టికి తీసుకెళ్లారు.
India fined for breach of ICC Code of Conduct against South Africa 👀https://t.co/CZO3nv5rcR
— ICC (@ICC) December 8, 2025
ఐసీసీ నిబంధనల్లోని ఆర్టికల్ 2.22 ప్రకారం స్లో ఓవర్ రేటుకు జట్టు సభ్యులు బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇదే విషయమై విచారణ సందర్భంగా కెప్టెన్ కేఎల్ రాహుల్ (KL Rahul) తన పొరపాటును అంగీకరించాడు. టీమిండియా ఆటగాళ్లకు ఫైన్ విధించాలనే నిర్ణయాన్ని ఆన్ ఫీల్డ్ అంపైర్లు రాడ్ టక్నర్, రోహన్ పండిట్.. థర్డ్ అంపైర్ సామ్ నొగజ్స్కీ, ఫోర్త్ అంపైర్ జయరామన్ మదన్‌గోపాల్ ఆమోదించారు. దాంతో.. రాయ్‌పూర్‌లో స్లో ఓవర్ రేటు కారణంగా భారత క్రికెటర్ల మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధిస్తూ నిర్ణయం తీసుకుంది ఐసీసీ. కీలకమైన మూడో వన్డేలో 9 వికెట్ల తేడాతో గెలుపొందిన టీమిండియా 2-1తో సిరీస్ కైవసం చేసుకుంది.