Ganja Batch | పటాన్ చెరు, అక్టోబర్ 24 : పటాన్ చెరు ఓఆర్ఆర్ మీదుగా గంజాయి అక్రమ రవాణా ఆగడం లేదు. పోలీసుల నిఘా లేకపోవడం, ప్రధాన గంజాయి స్మగ్లర్లను పట్టుకోవడంలో పోలీసులు విఫలం కావడంతో దందా కొనసాగుతుంది . స్మగ్లింగ్ చేస్తున్న సూత్రధారులు దొరకకపోవడంతో నిర్భయంగా ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ నుంచి మహారాష్ట్రకు గంజాయి స్మగ్లింగ్ జరుగుతుంది. అమాయక యువకులు స్మగ్లర్ల గాలానికి చిక్కి డబ్బుల కోసం ఆశపడి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. గంజాయి స్మగ్లింగ్ చేస్తూ పోలీసులకు చిక్కి జైలు జీవితాలు గడుపుతున్నారు.
ఓఆర్‌ఆర్‌తోపాటు సర్వీస్ రోడ్లపై నిఘా లేకపోవడంతో స్మగ్లర్లు రూట్లు మార్చి గంజాయి తరలిస్తున్నట్టు తెలిసింది. పటాన్ చెరు పోలీసులు వాహనాలను తనిఖీ చేయకపోవడం, సర్వీస్ రోడ్లపై నిఘా పెట్టకపోవడంతో రోడ్లు మార్చి నిర్భయంగా పక్క రాష్ట్రాలకు తరలిస్తున్నారు.
విజయవాడ, వరంగల్ వైపు నుంచి వచ్చే వాహనాలు ఓఆర్ఆర్ మీద తమకు అనుకూలంగా ఉన్న ఎగ్జిట్ వద్ద ఆగి సర్వీస్ రోడ్లు 65వ జాతీయ రహదారి నుంచి ముంబై వైపు స్మగ్లర్లు వెళుతున్నట్టు తెలిసింది. విజయవాడ వైపు నుంచి వచ్చేవారం ఎక్కువ కొల్లూరు, ముత్తంగి ఎగ్జిట్ వద్ద దిగి సర్వీస్ రోడ్ లో సీసీ కెమెరాలు లేని రోడ్లు, సర్వీస్ రోడ్ ద్వారా వెళుతున్నట్టు సమాచారం. గతంలో విజయవాడ వైపు నుంచి వచ్చి సర్వీస్ రోడ్ లో వస్తున్న వాహనాలను భానుర్ పోలీసులు తనిఖీ చేయగా భారీ మొత్తంలో గంజాయి లభించింది. ఓఆర్ఆర్ రోడ్డుపై వాహనాన్ని నిలిపి గంజాయి స్మగ్లర్లు డ్రైవర్లను మార్చి మహారాష్ట్రకు తరలిస్తున్నారని తెలిసింది.
ఖమ్మం, విశాఖ ఏజెన్సీ నుంచి గంజాయిని ప్రైవేట్ వాహనాలలో రవాణా చేస్తున్నారు. గంజాయి రవాణా చేస్తున్న వాహనాలు నడిపేందుకు డ్రైవర్లను అద్దెకు తీసుకొని తరలిస్తున్నారు. డ్రైవర్లకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా పలానా చోట నుంచి వాహనాన్ని తీసుకొని పాలన ప్రాంతానికి రావాలని సమాచారం ఇస్తారని తెలిసింది. అక్కడికి రాగానే డ్రైవర్‌ను మార్చి మరో డ్రైవర్‌తో ఇతర ప్రాంతానికి వాహనాన్ని పంపిస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది.
గంజాయి తరలిస్తున్న ముఠా ముందుగానే ఎస్కార్ట్ వాహనాన్ని రోడ్డుపై పంపిస్తారు. ఎస్కార్ట్ వాహనంలో వెళుతున్న వారు సిగ్నల్ ఇస్తేనే గంజాయి ఉన్నవాహనం ఆ రోడ్డుపై నుంచి తీసుకువస్తారని సమాచారం. ప్రతి గంజాయి తరలిస్తున్న వాహనానికి ఎస్కార్ట్ వాహనం ఉంటుందని తెలిసింది. ఓఆర్ఆర్ రోడ్డుపై పోలీస్ నిఘా లేకపోవడంతో స్మగ్లింగ్ జోరుగా సాగుతుంది.
ఓఆర్ఆర్ రోడ్డు గంజాయి స్మగ్లింగ్.. ?
ఓఆర్ఆర్ రోడ్డుపై పోలీస్ నిఘా లేకపోవడంతో స్మగ్లర్లు రూట్లు మార్చి గంజాయి తరలిస్తున్నారని తెలిసింది. ఎక్కువగా పోలీసులు లేని ఎగ్జిట్ ల నుంచి వాహనాలను సర్వీస్ రోడ్ పై తీసుకువచ్చి పలుమార్గాలలో మహారాష్ట్ర కర్ణాటకకు తరలిస్తున్నట్టు తెలిసింది. బొల్లారం ,ముత్తంగి, కొల్లూరు, ఎగ్జిట్‌లో నుంచి వాహనాలను సరీస్ రోడ్డు ద్వారా పంపిస్తున్నట్టు తెలిసింది.
డ్రైవర్లకు గంజాయితో ఉన్న విషయం తెలియకుండా స్మగ్లర్లు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలిసింది. గంజాయి స్మగ్లర్లు ఖమ్మం, విశాఖ ఏజెన్సీ నుంచి ఓఆర్ఆర్ వరకు ఒక డ్రైవర్‌ను ఉపయోగిస్తారని తెలిసింది. ఓఆర్ఆర్ నుంచి కర్ణాటక సరిహద్దు వరకు మరో డ్రైవర్‌ను ఉపయోగిస్తారని సమాచారం. డ్రైవర్లను మార్చి స్మగ్లింగ్ చేయడంతో వాహనాలు నడిపే వారికి సైతం అందులో ఉన్న విషయం తెలియడం లేదు. కొందరు స్మగ్లర్లు ఏజెంట్లను నియమించుకొని ప్రైవేటు వాహనాలు అద్దెకు తీసుకొని నిర్భయంగా దందా నిర్వహిస్తున్నారని తెలిసింది.
మహారాష్ట్ర, కర్ణాటక కు చెందిన స్మగ్లర్లు ప్రతిరోజు ఓఆర్ఆర్తో పాటు పలు మార్గాలను రూట్లను ముందుగానే చూసుకొని పోలీసుల నిఘా లేని మార్గాలలో తరలిస్తున్నట్టు తెలిసింది. శిలావతి అనే గంజాయికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉండడంతో స్మగ్లర్లు ఎక్కువగా ఏజెన్సీ ప్రాంతాల నుంచి తీసుకువచ్చి మహారాష్ట్రలో విక్రయిస్తున్నారని సమాచారం. లారీలతోపాటు కార్లు, ఆటోలు, డీసీఎంలను ఎక్కువగా గంజాయి స్మగ్లింగ్ చేసేందుకు ఉపయోగిస్తున్నారని విశ్వాసనీయంగా తెలిసింది. అక్రమ గంజాయి రవాణాను అరికట్టేందుకు ప్రభుత్వం పోలీసులతోపాటు ఎక్సైజ్ పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎక్సైజ్ పోలీసులు ఎక్కువగా గంజాయి స్మగ్లింగ్‌పై దృష్టి పెట్టడం లేదని తెలిసింది. పోలీసులు వాహనాల తనిఖీలు చేయకపోవడం, తనిఖీలు చేసిన సమయంలో ముందుగానే స్మగ్లర్లు సమాచారాన్ని తెలుసుకొని ఆ రూట్లో రావడంలేదని తెలిసింది.
వారం రోజుల్లో రెండు గంజాయి కేసులు నమోదు..
పటాన్ చెరు లో ఈనెల 18న 26.4 కిలోల ఎండు గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముత్తంగి ఓఆర్ఆర్ వద్దకు సర్వీస్ రోడ్లు నమ్మదగ సమాచారం మేరకు ఎస్సై మహేశ్వర్ రెడ్డి తన సిబ్బందితో వాహనాలు తనిఖీ చేస్తుండగా నిశాద్ వీరేంద్ర కుమార్ (37) ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లా పాలగడ్డ గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఒరిస్సా రాష్ట్రం నుంచి అమ్మకం చేస్తున్నారని తెలిపారు. గంజాయి తరలిస్తున్న వ్యక్తి నుంచి ఒక ఆటో, రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు.
గంజాయి తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్
ఒరిస్సా నుంచి మహారాష్ట్రకు గంజాయి తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం సాయంత్రం నమ్మదగ్గ సరం సమాచారం మేరకు పటాన్ చెరు పోలీసులు ముత్తంగి ఓఆర్ఆర్ వద్ద సర్వీస్ రోడ్లో బట్టల మధ్య పది కిలోల ఎండు గంజాయిని తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ జిల్లాకు చెందిన సంతోష్ మధుకర్ చవాన్ (34) గా పోలీసులు గుర్తించారు. ఒరిస్సా రాష్ట్రంలోని సురేష్ బేహార్ అనే వ్యక్తి నుంచి పది కిలోల ఎండు గంజాయిని తక్కువ ధరకు కొనుగోలు చేసి మహారాష్ట్రలో ఎక్కువ ధరకు విక్రయిస్తున్నట్టు తెలిపారు. గంజాయి తరలిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసి పది కిలోల ఎండు గంజాయి పాటు ఒక సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.

Gold Rates | మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంతంటే..?
Shreyas Iyer: డైవింగ్ చేస్తూ స్టన్నింగ్ క్యాచ్.. కానీ గాయపడ్డ అయ్యర్.. వీడియో