హైదరాబాద్: రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని పట్టుకుని దేశం మొత్తం తిరుగుతున్నారని, కానీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం సొంత రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి (Niranjan Reddy) విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ అశోక్ నగర్‌కు వెళ్లి యువతకు హామీలు ఇచ్చారని, అదే అశోక్‌నగర్‌లో ఉద్యోగాలు అడిగిన
నిరుద్యోగులపై లాఠీచార్జ్ చేశారని మండిపడ్డారు. తెలంగాణ భవన్లో ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణా రావు, ముఠా గోపాల్, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. గతేడాదికి సంబంధించి ప్రభుత్వం చెల్లించాల్సిన బోనస్ రూ.1,150 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. కేసీఆర్ దళితబంధును అమలు చేస్తే ఎగతాళి చేశారని, ఇతర వర్గాలను రెచ్చగొట్టారని చెప్పారు. ఏఐసీసీ చీఫ్ ఖర్గేను తీసుకువచ్చి దళితబంధు కింద రూ.12 లక్షలు ఇస్తామని చెప్పారని గుర్తుచేశారు.
సీఎం, మంత్రుల ఆధిపత్య ధోరణి భరించలేక ఐఏఎస్ అధికారులు పదవులు వదులుకుంటున్నారు. కొంతమంది ఐఏఎస్ అధికారులు ప్రభుత్వానికి ఊడిగం చేస్తున్నారని విమర్శించారు. ఒక మంత్రి సిద్దిపేటలో గుడికి వెళ్లి ప్రమాణం చేశారని, ఏ మంత్రుల శాఖల్లో గొడవలు అయ్యాయో వారిని ప్రమాణం చేయించాలన్నారు. స్వయంగా మంత్రి కుమార్తె సీఎంపై వ్యాఖ్యలు చేశారన్నారు. ఒక మంత్రి శాఖకు సంబంధించిన అంశాలు ఎవరో మాట్లాడటం అంటే సమాచారం లీక్ కావడమేనని చెప్పారు. మంత్రి గోప్యంగా ఉంచాల్సిన అంశాలను కుమార్తె మాట్లాడారు. మంత్రి ఫైల్ బయటపెట్టడం నేరమని, ఈ విషయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఆయన ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. దీనిపై చీఫ్ సెక్రటరీ గవర్నర్‌కు లేఖ రాయాలని డిమాండ్ చేశారు.
కృతజ్ఞత లేని మనుషుల్లో మా జిల్లా మంత్రి మొదటి స్థానంలో ఉంటారని విమర్శించారు. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉంటే అందులో మంత్రిగా మా జిల్లా మంత్రి ఉంటారని ధ్వజమెత్తారు. రిజ్వీ నిజాయితీ గల అధికారి అని ప్రజలకు తెలుసని, ఆయనను మానసికంగా వేధించడంతోనే రాజీనామా చేశారన్నారు. రిజ్వీ రాజీనామా రాజకీయ నాయకులకు చెంపపెట్టు అని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాడి రెండేండ్లు అవుతున్న పూర్తి స్థాయి మంత్రివర్గం లేదని విమర్శించారు. రిజ్వీ నిజాయితీ మీద తమకు పూర్తి నమ్మకం ఉందని చెప్పారు. లివ్ అండ్ లెట్ లివ్ అనేది సాధారణ సూత్రమని, రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మాత్రం అది లూట్ అండ్ లెట్ లూట్గా మారిందన్నారు. సీఎం లూటీ చేస్తున్నారు కాబట్టి మంత్రులు కూడా దోచుకుంటున్నా ప్రశ్నించడంలేదని చెప్పారు. అందరం కలిసి రాష్ట్రాన్ని లూటీ చేద్దామని సీఎం ఆలోచనగా ఉందని విమర్శించారు.