Kamkole Gram Panchayat | మునిపల్లి, ఫిబ్రవరి 24 : సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని పంచాయతీ కార్యదర్శులు కంకోల్ గ్రామాన్ని బంగారు కొండ లాగా భావిస్తున్నారు. మండలంలోని కంకోల్ గ్రామ శివారులో గల woxsen యూనివర్సిటీ ఉండడంతో పంచాయతీ కార్యదర్శుల కండ్లు అన్ని కంకోల్ పంచాయతీ వైపే చూస్తున్నాయి. పంచాయతీ కార్యదర్శిగా ఉద్యోగం చేస్తే కంకోల్ కార్యదర్శిగా చేయాలి… అని మునిపల్లి మండల పరిధిలోని పలువురు పంచాయతీ కార్యదర్శులు వారి.. వారి ఫ్రెండ్స్‌తో చర్చలు జరుపుతున్నట్లు నమ్మదగ్గ సమాచారం.
మునిపల్లి మండలంలోని కంకోల్ గ్రామంలో woxsen యూనివర్సిటీ దేశంలోనే అతి పెద్ద యూనివర్సిటీల్లో ఒకటి కావడంతో పంచాయతీ కార్యదర్శులు కంకోల్ గ్రామాన్ని బంగారు బాతులాగా భావిస్తున్నారు. మండలంలో పంచాయతీ కార్యదర్శిగా ఉద్యోగం చేస్తే కంకోల్ గ్రామంలో చెయ్యాలి.. లేకపోతే చేయొద్దు అనే మాటలు జోరుగా వినిపిస్తున్నాయి. మండలంలోని కంకోల్ యూనివర్సిటీ నుంచి అధిక డబ్బులు దండుకోవచ్చు అనే ఆలోచనతో ఉన్నట్లు వినికిడి… కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి అన్నట్లు చేస్తే కంకోల్ పంచాయతీ కార్యదర్శిగా చేయాలంటూ మండలంలోని పలు గ్రామాల కార్యదర్శిల కోరిక.. కొంతమంది పంచాయతీ కార్యదర్శులు అయితే పంచాయతీ కార్యదర్శి ఏ ఊర్లో చేస్తే ఏముందిలే ఉద్యోగం ఉందా లేదా అని భావనతో ఉద్యోగం చేస్తున్నరు.
మునిపల్లి మండలంలోని కంకోల్ గ్రామ శివారులో గల woxsen యూనివర్సిటిలో డిజిటల్ సర్వే చేస్తే కంకోల్ గ్రామానికి ట్యాక్సి రూపంలో మరిన్ని నిధులు వచ్చే అవకాశం ఉందని స్థానికులు వాపోతున్నారు. సర్వే చేసి గతంలో నిర్మాణం చేపట్టిన భవనాలకు మాత్రమే యూనివర్సిటీ యాజమాన్యం ప్రస్తుతం టాక్స్ చెల్లిస్తుంది. ఆరు సంవత్సరాల నుంచి woxsen యూనివర్సిటీలో పదుల సంఖ్యలో భవనాలు నిర్మించి క్రీడారంగంలో యూనివర్సిటీ విద్యార్థులు రాణించేందుకు క్రికెట్, ఫుట్‌బాల్, మరిన్ని స్టేడియాలు సైతం నిర్మించి వినియోగంలోకి తీసుకువచ్చారు. యూనివర్సిటీలో పలు భవనాలకు గతంలో పర్మిషన్లు ఇచ్చిన నేటి వరకు ట్యాక్స్ చెల్లించకుండా గతంలో మాదిరిగానే పంచాయతీకి యూనివర్సిటీ యాజమాన్యం ట్యాక్స్ చెల్లిస్తుంది.
నూతనంగా నిర్మాణం చేపట్టిన పలు భవనాలకు ట్యాక్సీలు చెల్లించడం లేదని గ్రామస్తులు యూనివర్సిటీ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వందల ఎకరాల యూనివర్సిటీ నిర్మాణం చేపట్టి కంకోల్ గ్రామానికి టాక్స్ రూపంలో కేవలం రూ. 32లక్షలు మాత్రమే చెల్లిస్తున్నట్లు గ్రామస్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. యూనివర్సిటీలో ఇతర దేశాల, ఇతర రాష్టాల విద్యార్థులు అధికంగా ఉన్నత చదువులు చదువుకుంటున్నట్లు సమాచారం.
విద్యార్థుల వద్ద యాజమాన్యం లక్షల రూపాయాలు వసూలు చేస్తున్నప్పటికీ కంకోల్ గ్రామానికి ట్యాక్స్ చెల్లించడంలో ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తున్నట్లు వారు ఆరోపిస్తున్నారు. యూనివర్సిటీలో నిర్మాణం చేపట్టిన బిల్డింగులకు, క్రీడా స్టేడియాలకు అనుగుణంగా లెక్కలు వేసి ట్యాక్స్ చెల్లిస్తే కంకోల్ గ్రామానికి మరిన్ని బోలెడు నిధులు వచ్చే అవకాశం ఉందంటున్నారు. దీంతో గ్రామం మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉందని వారు వాపోతున్నారు.
అధికారులు నిర్లక్ష్యమేనా..?
మునిపల్లి మండల పరిషత్ అధికారులు నిర్లక్ష్యంతో కంకోల్ గ్రామ శివారులోని వోక్స్ యూనివర్సిటీ డిజిటల్ సర్వే చేయడంలో మండల పరిషత్ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నట్లు పలు రకాల విమర్శలు వినిపిస్తున్నాయి. యూనివర్సిటీ యాజమాన్యం నుంచి సంబంధిత అధికారులకు కావలసినన్ని ముడుపులు ముట్టడంతో సంబంధిత అధికారులు నిమ్మకి నేరెత్తినట్లు వ్యవహరిస్తున్నట్లు గ్రామస్తులు సంబంధిత అధికారులు తీరుపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
యూనివర్సిటీ డిజిటల్ సర్వే చేయించి యూనివర్సిటీలో నూతనంగా నిర్మాణం చేపట్టిన అన్ని రకాల బిల్డింగులకు స్టేడియాలకు నిబంధనలు ప్రకారం టాక్స్ లు చెల్లిస్తే కంకోలు గ్రామానికి బోలెడన్ని నిధులు వచ్చే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి కంకోల్ గ్రామ శివారులోని woxsen యూనివర్సిటీలో డిజిటల్ సర్వే చేయించి కంకోల్ పంచాయతీకి అధికంగా నిధులు వచ్చేలా ఉన్నత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
కార్యదర్శి పోస్టుకు భలే డిమాండ్..
మునిపల్లి మండలంలోని కంకోల్ పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహించాలనుకున్నవారు పై అధికారులకు లక్షల్లో ముడుపులు అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. మండలంలోని కంకోల్, బుదేరా పంచాయతీ కార్యదర్శులుగా రావాలనుకునేవారు సుమారు రు. 5లక్షలకు పైగా ముడుపులు అందిస్తేనే కంకోల్ గ్రామాలకు బదిలీపై వెళ్లొచ్చు అనే మాటలు మండలంలో కోడై కోస్తున్నాయి.
ప్రస్తుతం మండలంలోని గ్రామాల్లో కార్యదర్శులుగా విధులు నిర్వహించేవారు కొంతమంది ఎన్ని డబ్బులు అయినా సరే కంకోల్ పంచాయతీ కార్యదర్శిగా చేయాలి అని మండలంలోని పంచాయతీ కార్యదర్శిలు మాట్లాడుకుంటున్నట్లు నమ్మదగ్గ సమాచారం. ఉన్నత అధికారులు స్పందించి యూనివర్సిటీని డిజిటల్ సర్వే చేయించేలా జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని కంకోల్ గ్రామస్తులు కోరుతున్నారు.

‘డబుల్ బెడ్రూం లబ్ధిదారులకు ప్రొసీడింగ్ ఆర్డర్స్ వెంటనే ఇవ్వాలి’
Cinema Is Dead | రాజమౌళితో మహేశ్ బాబు ఫైటింగ్.. AIతో సినిమా చనిపోయిందంటూ వర్మ పోస్ట్