FTL Limits | అమీన్పూర్, ఏప్రిల్ 20 : సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన వెంటనే చెరువు కుంటలను కాపాడే దిశగా ప్రత్యేకంగా హైడ్రా సంస్థను ఏర్పాటు చేసి ఎఫ్టీఎల్ బఫర్ స్థలాలలో ఉన్నాయంటూ చాలా చోట్ల కూల్చివేతలకు పూనుకున్నారు. ముఖ్యంగా అమీన్పూర్ ప్రాంతంలో అనేక చోట్ల భారీ భవనాలను సైతం కూల్చివేతలు చేసిన సంఘటనలు అందరికి తెలిసిందే. అంతవరకు బాగానే ఉన్నా.. హైడ్రాను ఏర్పాటు చేసినప్పుడు ప్రభుత్వ భవనాలకు వర్తించవు (ఎగ్జమ్షన్) అనే నిబంధనలు ఉన్నాయా..? ఉంటే ప్రజలకు తెలియచేయాలని కోరుతున్నారు.
ఇప్పటివరకు అలాంటి మాట ఎక్కడా వినపడలేదని తెలుసు. కానీ ఎఫ్టీఎల్ స్థలాలలో ప్రభుత్వ భవనాలు నిర్మిస్తే భవిష్యత్తులో ఎటువంటి అనర్థాలు జరుగవా.. ? అంటూ ప్రశ్నలు వినపడతున్నాయి. అయితే అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని బీరంగూడ శంభుని కుంట పరిసరాలలోని ఎఫ్టీఎల్ స్థలాలలో అనేక అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారంటూ ఇరిగేషన్ అధికారులతోపాటు హైడ్రా కమీషనర్‌కు సైతం చాలా ఫిర్యాదులు చేశారు. దీంతో హైడ్రా కమీషనర్ రంగనాథ్ ప్రత్యక్షంగా రెండుసార్లు సందర్శించి పరిశీలించారు. అందుకు పటాన్చెరు ఇరిగేషన్ అధికారులు అక్కడి నూతన నిర్మాణాలతోపాటు పాత భవనాలకు సైతం నోటీసులు ఇవ్వడం జరిగింది.
అంతవరకు హైడ్రా పనితీరు,ఇరిగేషన్ అధికారుల ఉత్సహంతో కుంటను పరిరక్షించేందుకు చేసిన ప్రయత్నాన్ని చూసి ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. కానీ అనతికాలంలోనే అదే శంభునికుంట ఎఫ్టీఎల్ స్థలాలలో గతంలో అటు పక్క ఇటు పక్క భవనాలకు నోటీసులు అందచేసిన ప్రాంతంలోనే ప్రభుత్వ పీహెచ్సీ భవనాన్ని నిర్మిస్తుండటం చూస్తుంటే ప్రజలు విస్తుపోతున్నారు. సుమారు 35 లక్షల రుపాయాల ప్రభుత్వ నిధులతో అట్టి పీహెచ్సీ భవన నిర్మాణం చేపట్టడం పట్ల అర్థం పరమార్థం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
భవిష్యత్తులో ఎఫ్టీఎల్లో ఉన్న భవనాలను కూల్చివేసే పరిస్థితులు వస్తే.. ప్రభుత్వ భవనం కూల్చాలా లేదా పక్కనే ఉన్న భవనాలను కాపాడాలా.. అనే ప్రశ్నలు వెలువెత్తున్నాయి. ఏదిఏమైనా ఎఫ్టీఎల్ స్థలంలో ప్రభుత్వ భవనం నిర్మించడం చూస్తూ సంబంధిత అధికారులు సైతం మిన్నకుండిపోవడం అశ్చర్యానికి గురి చేస్తుందని స్థానికులు వాపోతున్నారు.
జీవో 58,59 దరఖాస్తుల తిరస్కరణ..
గతంలో ఇదే ప్రాంతంలో కొందరు పేదలు కట్టుకున్న తమ ఇండ్లకు అప్పటి ప్రభుత్వం ప్రవేశపెట్టిన 58, 59 జీవో ద్వారా దరఖాస్తులు చేసుకున్నారు. అయిప్పటికీ అట్టి ధరఖాస్తులను పరిశీలించి మీ ఇండ్ల స్థలాలు శంభునికుంట ఎఫ్టీఎల్ ప్రాంతంలో ఉన్నాయని రెవెన్యూ అధికారులు తిరస్కరించారు. కానీ ప్రస్తుతం అదే స్థలంలో ప్రభుత్వ భవనం ఏర్పాటు చేస్తుండటం పట్ల మా దరఖాస్తులను తిరిగి పరిశీలించి 58,59 జీవో ద్వారా రెగ్యులరైజేషన్ చేయాలని కోరుతున్నారు.
CC cameras | నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర కీలకం
Indigo flight | విమానాన్ని ఢీకొట్టిన టెంపో ట్రావెలర్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?