Indigo flight : బెంగళూరులోని కెంపెగౌడ విమానాశ్రయంలో (Kempegowda Airport) త్రుటిలో ప్రమాదం తప్పింది. ఆగిఉన్న ఇండిగో విమానాన్ని (IndiGo aircraft) ట్రావెలర్ టెంపో ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో టెంపోలో డ్రైవర్ మాత్రమే ఉన్నాడని, ఎవరికీ ఎలాంటి అపాయం జరగలేదని అధికారులు వెల్లడించారు. ప్రమాదానికి కారణమైన టెంపోను ఆకాశ ఎయిర్ (Akasa Air) సిబ్బందిని వారి కార్యాలయం నుంచి ఎయిర్‌క్రాఫ్ట్ బే వద్దకు తీసుకురావడానికి వినియోగిస్తున్నారని తెలిపారు.
డ్రైవర్ నిద్రమత్తులో ఉన్న కారణంగా ప్రమాదం జరిగిందని, ఈ విషయం ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైందని అధికారులు చెప్పారు. ప్రమాదం వల్ల పలు విమాన సర్వీసుల్లో స్వల్ప అంతరాయం కలిగిందని, తర్వాత వాటిని పునరుద్ధరించామని అన్నారు. ఈ ఘటనపై ఇండిగో స్పందిస్తూ.. బెంగళూరు ఎయిర్‌పోర్టులో ఆగి ఉన్న విమానాన్ని టెంపో ఢీకొట్టడంపై తమకు సమాచారం అందిందని, ఈ విషయంపై జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్‌కు సమాచారం వెల్లడించామని తెలిపింది. ప్రయాణికుల భద్రత, సౌకర్యాలకు తాము అధిక ప్రాధాన్యం ఇస్తామని, ఈ విషయంపై ఎయిర్‌లైన్స్ విచారణ జరిపి చర్యలు తీసుకుంటుందని చెప్పింది.