Viral news : అతడు పెళ్లిచూపులకు వెళ్లాడు. అమ్మాయిని నచ్చాడు. దాంతో పెళ్లికి ముహూర్తం కూడా పెట్టుకున్నారు. పెళ్లికి ముందు నిర్వహించే తిలకోత్సవ్ (Tilakotsav) కూడా ఘనంగా జరుపుకున్నారు. కానీ తీరా పెళ్లి రేపనగా వరుడు (Groom) బాంబు పేల్చాడు. ఏకంగా వధువు (Bride) తండ్రికి ఫోన్ చేసి ‘నాకు మీ పెద్దమ్మాయి వద్దు, చిన్నమ్మాయిని పెళ్లి చేసుకుంటా’ అని చెప్పాడు. దాంతో వధువు ఆత్మహత్యాయత్నం చేసింది. వధువు తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.
వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లా మన్గవా ఠాణా పరిధిలో.. స్థానిక యువతికి పెళ్లి నిశ్చయమైంది. ఈనెల 18న వివాహం జరిగేలా పెద్దలు ముహూర్తం ఖరారు చేశారు. పెళ్లి తంతులో భాగంగా 16న వధువుకు బొట్టుపెట్టే ‘తిలకోత్సవ్’ కార్యక్రమం కూడా ఘనంగా జరిగింది. పెళ్లికి సరిగ్గా ఒకరోజు ముందు అంటే ఏప్రిల్ 17న వధువు తండ్రికి వరుడు ఫోన్ చేశాడు. ‘మీ పెద్దమ్మాయి వద్దు.. చిన్నకుమార్తెను పెళ్లాడతా’ అని బాంబు పేల్చాడు. దాంతో వధువు తండ్రి బిత్తరపోయాడు.
తండ్రి ద్వారా విషయం తెలుసుకున్న వధువు ఆత్మహత్యాయత్నం చేసింది. అయితే ప్రాణాపాయం నుంచి బయటపడింది. ప్రస్తుతం ఆమె రేవాలోని సంజయ్‌గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. కాగా వధువుకు ఇదివరకే వివాహమై విడాకులు తీసుకుంది. అంతా తెలిసే వరుడు ఆమెను పెళ్లి చేసుకునేందుకు అంగీకరించాడు. తీరా పెళ్లి రేపనగా వరుడు చేసిన పనితో తీవ్ర మనస్తాపానికి గురైంది. అందుకే ఆత్మహత్యాయత్నం చేసింది. వ్యవహారం పోలీసుల దాకా వెళ్లింది.