ఆందోల్ మే 15 : మండు వేసవిలో అకాల వర్షాలు అన్నదాతలను ఆగం చేస్తున్నాయి. దీంతో ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు వర్షార్పణం అవుతుండడంతో రైతులు కన్నీళ్ల పర్యంతంమవుతున్నారు. ధాన్యం కొనుగోళ్లు ఇంకా పూర్తి కాకపోవడంతో రైతుల బాధలు వర్ణనాతీతంగా మారాయి. సంగారెడ్డి జిల్లా అందోల్ మండలంలో గురువారం తెల్లవారు జాము నుండి ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి కొనుగోలు కేంద్రాలతో పాటు..రోడ్లపై ఆరబెట్టిన వరి ధాన్యం వరద నీటిలో కొట్టుకుపోయింది.
సంబంధిత అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ధాన్యం తడుస్తున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. సకాలంలో వడ్లు తూకం వేసి కొనుగోలు చేస్తే రైతులకు ఇబ్బందులు ఉండవని.. కనీసం టార్పలిన్ కవర్లు అందజేసి ఉంటే ధాన్యం తడిసేది కాదని రైతులు ఆందోళన చెందుతున్నారు. మండలంలోని కొనుగోలు కేంద్రాలు, రోడ్లు.. పంట పొలాల వద్ద రైతులు ఆరబెట్టిన వడ్లు పూర్తిగా వర్షానికి తడిసి వరదలో కొట్టుకుపోయాయి.
ఆల్మైపేట్ , చింతకుంట, రోళ్లపాడ్, డాకూర్ ఇలా పలు గ్రామాల్లో వడ్ల కొనుగోలు కేంద్రాల్లో వర్షానికి ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. సమయానికి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనకపోవడం..కొన్న ధాన్యాన్ని లారీల్లో తరలించకపోవడం..ధాన్యం ఆరబెట్టిన చోట టార్పలిన్ కవర్లు అందజేయకపోవడం పాటు సరైన ఏర్పాట్లు చేయకపోవడంతోటి ఈ దుస్థితి వచ్చిందని రైతులు బోరునవిలపిస్తున్నారు. ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.