జహీరాబాద్ , అక్టోబర్ 21: జహీరాబాద్ నియోజకవర్గం ఆయా మండలాలను పొగమంచు (Dense Fog) కమ్మేసింది. మంగళవారం తెల్లవారుజామున 4 నుంచి ఉదయం 8 గంటలు దాటినా దట్టంగా మంచు కురుస్తూనే ఉన్నది. దీంతో ఆయా మండలాల పరిధిలోని హైదరాబాద్-ముంబై, జహీరాబాద్-బీదర్, ఝరాసంగం, మొగుడంపల్లిడం, న్యాల్కల్ మండలాలకు వెళ్లే దారుల గుండా రాకపోకలు సాగించే వాహనదారులు, ప్రజలు నానా అవస్థలు పడ్డారు. పొగమంచు కారణంగా రోడ్లు కనిపించకపోవడంతో వాహనాలు మెల్లగా కదిలాయి. ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవడంతో లైట్లు వేసుకొని వెళ్లాల్సి వచ్చింది. పొగ మంచు కారణంగా 8 గంటల తర్వాత సూర్యుడు దర్శనం ఇచ్చాడు. ఆయా మండలాల్లోని ప్రధాన రహదారులు పంట పొలాల్లో ఎక్కడ చూసినా పొగమంచు పరుచుకొని అందమైన దృశ్యాలు కనువిందు చేయగా, ‘నమస్తే తెలంగాణ’ క్లిక్‌మనిపించింది!.