పటాన్చెరు, జూలై 1: పటాన్ చెరు ప్రభుత్వ దవాఖాన మార్చురీలో హృదయవిదారక దృశ్యాలు కనిపిస్తున్నాయి. మంగళవారం పటాన్చెరు సర్కారు దవాఖానలోని పోస్టుమార్టం గదిలో మృతదేహాలు కుప్పలుగా పడి ఉన్నాయి. మార్చురీలో గుట్టలు గుట్టలుగా పడి ఉన్న సిగాచి కార్మికుల మృతదేహాలు చూసి కుటుంబీకులు కంటతడి పెట్టుకుంటున్నారు. ఏ మృతదేహం ఎవరిదో తెలియక మార్చురీ వద్ద కార్మికుల కుటుంబాలు ఎదురు చూస్తున్నాయి. డీఎన్ఎ రిపోర్ట్ వచ్చాక వైద్య శాఖ అధికారులు మృతదేహాలను బంధువులకు అప్పగించనున్నారు.
కాగా, సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి ఫార్మాస్యూటికల్ కంపెనీలో (Sigachi Industries) జరిగిన భారీ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్నది. రియాక్టర్ పేలుడుతో ఇప్పటివరకు 45 మంది మరణించారు. వివిధ దవాఖానల్లో మరో 31 మంది చికిత్స పొందుతున్నారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నది. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.