NIMZ Project | జహీరాబాద్ , మే 9 : జాతీయ పెట్టుబడుల ఉత్పాదక మండలి(నిమ్జ్)లో మౌలిక వసతుల కల్పన పనులను స్పీడప్ చేయాలని సంగారెడ్డి కలెక్టర్ ప్రతీక్ జైన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం సంగారెడ్డి జిల్లా ఝరాసంగం, న్యాల్కల్ మండలాల పరిధిలోని ఎకరాల్లో చీలేపల్లి, ముంగి, రుక్మాపూర్ శివారులో మొదటి విడతలో సేకరించిన 3240 ఎకరాల్లో చేపట్టిన మౌలిక వసతుల పనులను ఆయన పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా సంబంధిత శాఖ అధికారులు, ఎస్ఆర్ఆర్ సంస్థ ప్రతినిధులతో కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడారు. మొదటి విడత సేకరించిన భూము లను వెంటనే స్వాధీనం పరుచుకొని కడీలు పాతి ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలన్నారు. నిమ్జ్ ప్రాజెక్ట్ కోసం సేకరించిన భూముల్లో రైతులు సాగు చేసిన పంటలను తొలగించి చెట్లు చెదారాన్ని తొలగించి గుంతలను పూడ్చివేసి చదును చేయాలన్నారు. మౌలిక వసతుల కల్పన కోసం చేపట్టాల్సిన పనులను వేగవంతంగా చేయాలని ఆదేశించారు. ఆయన వెంట జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ సంబంధిత అధికారులు తదితరులు ఉన్నారు.