జహీరాబాద్, ఏప్రిల్ 8 : తన తల్లిని బూతులు తిడుతున్నాడని ఓ వ్యక్తి దారుణంగా చంపేశాడో కొడుకు. తన స్నేహితుడి సాయంతో ఆ వ్యక్తిపై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి హత్య చేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. సంగారెడ్డి జిల్లా మొగడంపల్లి మండలం చిరాగ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. హత్య విషయం తెలియడంతో రంగంలోకి దిగిన పోలీసులు 24 గంటల్లోనే హంతకులను పట్టుకుని న్యాయస్థానం ముందు హాజరుపరిచారు.
సంగారెడ్డి జిల్లా మొగడంపల్లి మండలం ధనసిరి గ్రామానికి చెందిన అబ్బాస్ అలీ (25) అనే యువకుడు ఓ మహిళను కొంతకాలంగా వేధిస్తున్నాడు. ఆ మహిళను బూతులు తిడుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. ఈ విషయం తెలిసిన మహిళ కొడుకు ఖలీల్ షా పద్ధతి మార్చుకోవాలని అబ్బాస్ అలీని పలుమార్లు హెచ్చరించాడు. అయినప్పటికీ అబ్బాస్ తన ప్రవర్తనను మార్చుకోకుండా అలాగే ఇబ్బందులకు గురిచేశాడు. దీంతో విసిగిపోయిన ఖలీల్ షా ఎలాగైనా అబ్బాస్‌ను హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే ఈ నెల 6వ తేదీన అబ్బాస్ తన స్నేహితులతో ఓ ఫామ్‌హౌస్‌లో పార్టీ చేసుకుంటున్నాడని తెలిసి.. అక్కడే చంపేయాలని అనుకున్నాడు. దీంతో తన స్నేహితుడు మెహతాప్ బిస్తీతో కలిసి స్కూటీపై ఖలీల్ ఫామ్‌హౌస్‌కు వెళ్లాడు.
తమ వెంట తీసుకొచ్చిన కత్తులతో అబ్బాస్ అలీపై ఖలీల్, అతని స్నేహితుడు విచక్షణారహితంగా దాడి చేసి హతమార్చాడు. ఈ దాడిని అడ్డుకునేందుకు అబ్బాస్ స్నేహితుడు అక్బర్ యత్నించాడు. కానీ అతనిపై బీర్ బాటిల్‌తో దాడి చేసి అక్కడి నుంచి పారిపోయారు. ఈ క్రమంలో దారిమధ్యలో శేఖర్ అనే వ్యక్తిని ఎయిర్ గన్, కత్తులతో బెదిరించి అతడి బైక్‌ను కూడా తీసుకెళ్లాడు. కాగా, అక్బర్ అలీ ఫిర్యాదు మేరకు చిరాగ్పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. జహీరాబాద్ పట్టణ సీఐ శివలింగం ఆధ్వర్యంలో ఎస్సై రాజేందర్ రెడ్డి పర్యవేక్షణలో క్రైమ్ బృందం రంగంలోకి దిగి నిందితుల కోసం గాలింపు చేపట్టింది. ఈ క్రమంలోనే జహీరాబాద్ పట్టణంలోని ఫూకట్ నగర్ కాలనీలోని ఓ ఇంట్లో ఖలీల్, బిస్తీ తలదాచుకున్నారని కనిపెట్టారు. వారిద్దరిని అరెస్టు చేసి, వారి నుంచి కత్తులు, స్కూటీ, బైక్, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని కోర్టులో హాజరుపరిచారు. చాకచక్యంగా వ్యవహరించి 24 గంటల్లోనే కేసును చేధించిన జహీరాబాద్ పట్టణ సీఐ శివలింగం, ఎస్సైరాజేందర్ రెడ్డి, ఇతర పోలీసుల బృందాన్ని డీఎస్పీ అభినందించారు.