Sai Priya Reddy | మెగాస్టార్ చిరంజీవి బ్లాక్ బస్టర్ హిట్ ‘మన శంకర వర ప్రసాద్ గారు’ చిత్రంలో నటించిన నటి సాయి ప్రియా రెడ్డి గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదలై 350 కోట్లకు పైగా వసూళ్లతో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన ఈ చిత్రం, ఫిబ్రవరి 11 నుంచి జీ5 (ZEE5) ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతూ రికార్డులు సృష్టిస్తోంది. ఈ సినిమాలో హీరో పాత్ర నిరంతరం వీక్షించే ఒక టీవీ సీరియల్ ట్రాక్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఆ సీరియల్లో ‘సౌమ్య’ అనే హీరోయిన్ పాత్రలో నటించి, తన నటనతో అందరి దృష్టిని ఆకర్షించింది సాయి ప్రియా రెడ్డి.
సినిమాలో మెగాస్టార్ పాత్ర తన జీవితాన్ని ఆ సీరియల్ పాత్రలతో పోల్చుకుంటూ చెప్పే డైలాగులు, ఆ కామెడీ ట్రాక్ ఆడియెన్స్‌ను కడుపుబ్బ నవ్వించాయి. దీంతో ఆ సీరియల్ హీరోయిన్ ఎవరబ్బా? అని నెటిజన్లు ఆరా తీయడం మొదలుపెట్టారు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన సాయి ప్రియా రెడ్డి.. గతంలో మిర్చి, రెబెల్, పూలరంగడు, తడాఖా వంటి భారీ చిత్రాల్లో నటించింది. ఇటీవలే విశ్వక్ సేన్ నటించిన ‘లైలా’ సినిమాలోనూ మెరిసిన ఈ బ్యూటీ, ఇప్పుడు మెగాస్టార్ సినిమాతో మరింత గుర్తింపు పొందింది. యూట్యూబ్ సిరీస్‌ల ద్వారా ఇప్పటికే క్రేజ్ సంపాదించుకున్న ఈమెకు, రాబోయే రోజుల్లో టాలీవుడ్లో మరిన్ని అవకాశాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.

Sai Priya Reddy