న్యూఢిల్లీ: అంతర్జాతీయ కార్మిక సంస్థ సమావేశాల్లో గిగ్ కార్మికుల కోసం కనీస ప్రమాణాలు ఏర్పాటు చేయాలన్న అంశంపై జరిగిన ఓటింగ్‌లో ఇండియా పాల్గొన్నది. దీన్ని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ తప్పుపట్టారు. డిజిటల్ ఫాట్‌ఫామ్ ద్వారా ఉపాధి పొందేవారిని గిగ్ వర్కర్స్ అంటున్నారు. అయితే డీసెంట్ వర్క్ ఇన్ ద ప్లాట్‌ఫామ్ ఎకనామీ అన్న అంశంపై ఐఎల్వో కన్వెన్షన్‌లో చర్చ జరిగింది. చివరకు ఓటింగ్ ప్రక్రియలో భారత్ పాల్గొనకపోవడాన్ని జాతీయ అవమానంగా ఎంపీ థరూర్ పేర్కొన్నారు. ఆయన తన ఎక్స్ అకౌంట్లో ఆ కామెంట్ చేశారు.
గిగ్ కార్మికుల రక్షణ కోసం ప్రపంచదేశాలు ఓటింగ్‌లో పాల్గొన్నాయని, కానీ అత్యధిక స్థాయిలో గిగ్ కార్మికులు ఉన్న ఇండియా మాత్రం ఓటింగ్‌కు దూరంగా నిలిచిందన్నారు. భారతీయ యువత అవసరాల పట్ల భారత ప్రభుత్వం అనుచితంగా వ్యవహరించిందన్నారు. కేవలం యాప్‌ల ఆధారంగా లక్షల సంఖ్యలో భారతీయులు సంపాదన ఆర్జిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. జెనీవాలో జూన్ 12వ తేదీన 114వ ఐఎల్వో సెషన్ జరిగింది. గిగ్ వర్కర్ల రక్షణ కోసం కనీస ప్రమాణాల కల్పన కోరుతూ కన్వెన్షన్‌లో తీర్మానించారు. దాని ప్రకారం కనీస వేతనం, భద్రత, సామాజిక భద్రత కల్పించాల్సి ఉంటుంది.
406 సభ్యదేశాలు అనుకూలంగా ఓటేశాయి. 8 దేశాలు వ్యతిరేకంగా ఓటింగ్‌లో పాల్గొన్నాయి. కానీ ఐఎల్వోలోని 36 సభ్య దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. దాంట్లో భారత్ కూడా ఉన్నది. యాప్‌ల ద్వారా పనిచేసే రైడర్లు, డ్రైవర్లు, పికర్, డేటా లేబర్లు.. గిగ్ వర్కర్ల జాబితాలో ఉన్నారు.