Bihar : బిహార్లో దారుణ ఘటన జరిగింది. వదిన వంట ఆలస్యం చేసిందని ఏకంగా ఆమె తల నరికి చంపాడు మరిది. ఈ ఘటన బిహార్, జెహనాబాద్ జిల్లా, పార్సా బిగా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇమాద్పూర్ గ్రామంలో జరిగింది. మృతురాలిని అన్షుదేవి (25)గా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ధర్మేంద్ర కుమార్ భార్య అన్షు దేవి. ఘటన జరిగిన సమయంలో అన్షు భర్త ధర్మేంద్రతోపాటు కుటుంబమంతా వ్యవసాయ పనుల కోసం పొలానికి వెళ్లింది. ఇంట్లో అన్షుదేవి మాత్రమే ఒంటరిగా ఉంది.
ఇదే సమయంలో ఆమె మరిది కునాల్ కుమార్ పని చేసి, ఇంటికి తిరిగొచ్చాడు. ఆ సమయానికి వంట ఇంకా రెడీ కాలేదు. దీంతో తనకు త్వరగా వంట చేసి, ఆహారం వడ్డించాలని వదిన అన్షుదేవిని కోరాడు. ఈ క్రమంలో వంట ఆలస్యం చేయడంపై కునాల్ తన వదినపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో ఇద్దరిమధ్యా కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో తీవ్ర ఆవేశానికి లోనైన కునాల్ కుమార్ తన వదినపై దాడి చేసి గొడ్డలితో నరికి చంపాడు. ఆమె తలను వేరు చేశాడు. పైగా ఆ తలను ఇంటి సమీపంలో ఉన్న మర్రిచెట్టుకు వేలాడదీశాడు. ఆ ఇంట్లో ఏదో గొడవ జరుగుతోందని గమనించిన చుట్టుపక్కల వాళ్లు వచ్చి చూశారు. అదే సమయంలో అక్కడ కొద్ది దూరంలో ఉన్న మర్రిచెట్టుకు అన్షుదేవి తల వేలాడుతూ కనిపించింది. దీంతో ఆ దృశ్యం చూసి షాక్కు గురైన వారు పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితుడు కునాల్ కుమార్ను అరెస్టు చేశారు. అతడు హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. అన్షుదేవి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భోజనం విషయంలో గొడవ జరగడం వల్లే హత్య జరిగినప్పటికీ.. మరేదైనా కారణం ఉందా అనే కోణంలో కూడా విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం నివేదిక అనంతరం తగిన చర్యలు తీసుకుంటామన్నారు.