– చుంచుపల్లి ఎంపీడీవో సుభాషిణి
చుంచుపల్లి, జూలై 30 : చుంచుపల్లి మండల సర్వసభ్య సమావేశానికి గైర్హాజరైన అధికారులపై జడ్పీ సీఈఓ నాగలక్ష్మి ఆదేశాల మేరకు ఆయా శాఖల అధికారుల నుండి వివరణ కోరుతూ జిల్లా శాఖల అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు ఎంపీడీఓ సుభాషిణి తెలిపారు. మండల స్పెషల్ ఆఫీసర్, ఇంటర్మీడియట్ నోడల్ అధికారి వెంకటేశ్వరరావు అధ్యక్షతన బుధవారం నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశానికి 19 శాఖలను ఆహ్వానించగా 11 శాఖలకు సంబంధించిన అధికారులు మాత్రమే హాజరయ్యారు. మిగతా ఎనిమిది శాఖల మండల అధికారులు హాజరు కాలేదని ఆమె తెలిపారు. విద్యుత్, వ్యవసాయ, అటవీ, ఎక్సైజ్, మత్స్య, పోలీస్, విద్యాశాఖ, ఇరిగేషన్ కీలక శాఖల అధికారులు గైర్హాజరు కావడంతో ఆయా శాఖలకు సంబంధించిన సమస్యలపై ప్రజా ప్రతినిధులకు సమాధానాలు లభించకపోవడంతో సమావేశంలో ప్రజా ప్రతినిధులు అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఎంపీడీఓ సుభాషిని మాట్లాడుతూ.. సమావేశం నిర్వహిస్తున్న విషయాన్ని అన్ని శాఖలకు ముందుగానే తెలియజేసినా కొందరు అధికారులు హాజరు కాలేదన్నారు. గైర్హాజరైన అధికారుల నుండి వివరణ కోరుతూ జిల్లా శాఖాధిపతులకు సీఈఓ ద్వారా లెటర్లను తయారు చేసి పంపుతున్నట్లు తెలిపారు. అదే విధంగా కలెక్టర్ కూడా పంపనున్నట్లు చెప్పారు. ఆయా జిల్లా అధికారులకు తెలిపిన వివరణ ఆధారంగా ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకుంటారని తెలిపారు. భవిష్యత్లో ఇలాంటి సమావేశాలకు అన్ని శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని ఆమె సూచించారు.