సంగారెడ్డి, ఫిబ్రవరి 21(నమస్తే తెలంగాణ)/నారాయణఖేడ్/ జహీరాబాద్/ అందోల్: ఈ జిల్లా బిడ్డగా సంగారెడ్డికి గోదావరి జలాలు తెస్తానని మాట ఇచ్చా.. ఇచ్చిన మాట మేరకు సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన చేస్తున్నా. 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ఈ రెండు పథకాలకు శంకుస్థాపన చేయడం సంతోషంగా, గర్వంగా ఉంది. ఏడాదిన్నరలోగా పనులు పూర్తిచేసి గోదావరి జలాలు సంగారెడ్డి, నారాయణఖేడ్, అందోలు, జహీరాబాద్ నియోజకవర్గ భూముల్లో గలగలా దుంకిస్తాం’ అని సీఎం కేసీఆర్ అన్నారు. సోమవారం రూ.4 వేల కోట్లతో నిర్మించే ఈ ఎత్తిపోతలకు నారాయణఖేడ్‌లో మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యేలు భూపాల్‌రెడ్డి, చంటి క్రాంతికిరణ్, మాణిక్‌రావు, మహిపాల్‌రెడ్డి, ఎంపీలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, బీబీ పాటిల్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్వహించిన భారీ బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు. అందోలు నియోజకవర్గం అల్లాదుర్గంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో నేను మాట్లాడుతూ కాళేశ్వరం పనులు పూర్తి కావస్తున్నాయి, త్వరలోనే సంగారెడ్డి జిల్లాకు గోదావరి జలాలు తీసుకొస్తానని హామీ ఇచ్చాను. జిల్లా బిడ్డగా గోదావరి జలాలు తీసుకొచ్చే బాధ్యత నాది అని రైతులు, ప్రజలకు చెప్పానన్నారు. నాడు ఇచ్చిన హామీ మేరకు ఈ రోజు సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతలకు శంకుస్థాపన చేసినట్లు సీఎం తెలిపారు. సంగారెడ్డి జిల్లాలో గోదావరి జలాలు పారి ఈ ప్రాంతం పచ్చగా మారాలని సీఎం ఆకాంక్షించారు. నేను గజ్వేల్ ఎమ్మెల్యేగా, హరీశ్‌రావు సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నామంటూ సిద్దిపేట, గజ్వేల్ కంటే ఎక్కువ సాగునీరు అందోలు నియోజకవర్గానికి అందుతున్నదని సీఎం కేసీఆర్ చెప్పారు. అందోలు నియోజకవర్గంలో 1.70 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. అందోలు ఎమ్మెల్యే క్రాంతికిరణ్ ఉత్సాహవంతుడని, బాగా పనిచేస్తున్నట్లు చెప్పారు. గోదావరి జలాల రాకతో అందోలు నియోజకవర్గం పచ్చబడే పరిస్థితి కనిపిస్తున్నదని సీఎం తెలిపారు. గోదావరి జలాల రాకతో సంగారెడ్డి ప్రాంత రైతులు, ప్రజల కలలు పండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఏడాదిన్నరలో గోదావరి జలాలు గలగలా దుంకియ్యాలే అన్నారు. రవాణాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు జిల్లా అంతటా కలియతిరిగానని నాటి రోజులను సీఎం గుర్తుచేశారు. సంగారెడ్డి డాక్ బంగ్లాలో వారం, పదిరోజులు ఉన్న విషయాన్ని, గంగకత్వ, బుగ్గ రామన్న, బండంపేట చెరువులు చూసిన ఆనాటి రోజులను సభలో ప్రస్తావించారు. తెలంగాణ రాకతో సాగునీట వనరుల దశ మారిందన్నారు.
నిమ్జ్ పూర్తి కావాలే…
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లోని నిమ్జ్ త్వరగా పూర్తి కావాలని సీఎం కేసీఆర్ అన్నారు. నిమ్జ్‌కు పరిశ్రమలు పెద్ద సంఖ్యలో వస్తున్నాయని, స్థానిక యువతకు ఉద్యోగాలు రావాలంటే శాంతిభద్రతలు బాగుండాలని తెలిపారు. జహీరాబాద్, సంగారెడ్డి, నారాయణఖేడ్‌లో సైతం ప్రశాంతమైన వాతావరణం ఉండాలన్నారు. కర్ఫ్యూలు, పోలీస్ ఫైరింగ్‌లు ఉంటే పరిశ్రమలు రావని, కొన్ని పార్టీలు మతం పేరుతో చిచ్చురేపే ప్రయత్నం చేస్తున్నాయని అన్నారు. ఈ విషయంపై గ్రామాల్లోకి వెళ్లి చర్చ జరుపాలని ప్రజలకు సీఎం సూచించారు.
పది రోజుల తర్వాత కేతకీకి వస్తా..
వారం పది రోజుల తర్వాత కేతకీ సంగమేశ్వరాలయానికి వస్తా.. ఆ సందర్భంలో సంగారెడ్డిలో మెడికల్ కళాశాలకు శంకుస్థాపన చేసుకుందాం. అభివృద్ధి జరుగుతది. సంగారెడ్డి జిల్లా కేంద్రం, జహీరాబాద్ పెద్ద మున్సిపాలిటీలు, వీటికి ఒక్కోదానికి రూ.50 కోట్ల చొప్పున రెండింటికీ రూ.100 కోట్లు మంజూరు చేస్తున్నా అని సీఎం కేసీఆర్ ప్రకటించారు. రేపే జీవో విడుదల చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని నారాయణ్‌ఖేడ్, జోగిపేట, సదాశివపేట, బొల్లారం, అమీన్పూర్, తెల్లాపూర్ మున్సిపాలిటీలకు ఒక్కో దానికి రూ.25 కోట్ల చొప్పున మొత్తం రూ.150 కోట్లు మంజూరు చేస్తున్నానన్నారు. వీటిని బాగా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మంత్రి హరీశ్‌రావు, ఎంపీ, ఎమ్మెల్యేలు, అధికారులు అందరూ కలిసి మున్సిపాలిటీల్లో పాదయాత్రలు చేసి ఎక్కడెక్కడ నిధులు అవసరమవుతాయో గుర్తించి, ఖర్చు చేయాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లో నిధులు వృథా చేయవద్దన్నారు. సంగారెడ్డి జిల్లాలోని 699 గ్రామ పంచాయతీలున్నాయని, ఇప్పటికే పల్లె ప్రగతి ద్వారా నెలనెలా డబ్బులు పంపిస్తున్నామని సీఎం తెలిపారు. పనులు అద్భుతంగా జరుగుతున్నాయని సర్పంచ్‌లను అభినందించారు. మంత్రి హరీశ్‌రావు కోరిక మేరకు జిల్లాలోని 699 పంచాయతీలకు ఒక్కో దానికి రూ.20 లక్షల చొప్పున నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. మొత్తం రూ.140 కోట్లు అవుతాయని, దీనికి సంబంధించిన జీవో రేపే వస్తుందని సీఎం చెప్పారు. తండాలకు సంబంధించి త్వరలోనే హైదరాబాద్‌లో గిరిజన సంక్షేమ శాఖ మంత్రిని అధికారులను పిలిపించి, మాట్లాడి, పంచాయతీరాజ్ రోడ్లకు ఎన్ని నిధులు అవసరం అవుతాయే ఆ నిధులు కూడా మంజూరు చేస్తానని భరోసా ఇచ్చారు. హరీశ్‌రావు దగ్గరనే గల్ల్లా పెట్టె ఉంటది.. తొందరలోనే మీటింగ్ పెట్టి, ఆ రోడ్లకు కూడా నిధులు మంజూరు చేస్తానన్నారు. జూన్ లోపల ఆ పనులు కూడా పూర్తి చేయాలన్నారు. నిజాంపేట మండలాన్ని కూడా ప్రకటించారు.
అడిగిందే తడవుగా వరాలు
అడిగిందే తడవుగా సంగారెడ్డి జిల్లా అభివృద్ధికి సీఎం కేసీఆర్ భారీగా నిధులు కేటాయించారు. మంత్రి హరీశ్‌రావు కోరిక మేరకు నిధులు మంజారుచేశారు. సోమవారం సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతలకు శంకుస్థాపన చేసిన అనంతరం నారాయణ్‌ఖేడ్ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. మంత్రి హరీశ్‌రావు బాగా హుషారుగా ఉన్నారు. ఏం లేదు సార్ వచ్చి ఫౌండేషన్ వేస్తే చాలు .. మిమ్మల్ని ఏం అడగం అని చెప్పాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది కావాలి, అది కావాలి అని మళ్లీ దుకాణం పెట్టాడు.. ఉండాలి అట్లా నాయకుడు.. ఉంటేనే పని జరుగుతుంది. సంగారెడ్డి నియోజకవర్గానికి మెడికల్ కళాశాలను మంజూరు చేసుకున్నాం. ఆ పనులు జరుగుతున్నాయి అని సీఎం కేసీఆర్ చెప్పారు.
కష్టపడే వారికి గుర్తు ఉంటుంది..
నారాయణ్‌ఖేడ్ ఎమ్మెల్యేగా భూపాల్‌రెడ్డిని గెలిపించే సందర్భంలో మంత్రిగా హరీశ్‌రావు ఇక్కడ చేసిన సేవ.. ఇన్ని రోజులు అయినా ఆయన చిమ్నిబాయిని గుర్తు పెట్టుకున్నారు. ఆ కష్టం చేసినాడు కాబట్టి ఆయనకు గుర్తు ఉంటుందని సీఎం కేసీఆర్ అన్నారు. చాలా సంతోషంగా ఉంది. ఒకప్పుడు తాను రవాణా మంత్రిగా ఉన్న సమయంలో ఈ ప్రాంతంలో విశేషంగా తిరిగానని గుర్తుచేశారు.
హరీశ్‌రావు క్రియాశీలక మంత్రి..
హరీశ్‌రావు క్రియాశీలక మంత్రి, ప్రజల కోసం పనిచేసే తపన ఉండే మంత్రి అని సీఎం కేసీఆర్ సభలో మెచ్చుకున్నారు. ఆయన ఈ జిల్లాలో ఉన్నాడు కాబట్టి మీకు మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. హరీశ్‌రావును కోరుతున్నా.. వీలైనంత తొందరగా ఏడాదిన్నర లోపు మీరు అధికారులు, కాంట్రాక్టర్ల వెంటబడి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అందరూ కలిసి నీళ్లు గలగల దుంకియ్యాలి.. బ్రహ్మాండంగా పోవాలి అని సీఎం కేసీఆర్ అన్నారు. అన్ని ప్రాంతాల్లో అద్భుతంగా నీళ్లు పారాలన్నారు.
భారీగా తరలివచ్చిన జనం
సభకు జిల్లా నుంచి పెద్దఎత్తున మహిళలు, రైతులు, యువత తరలివచ్చారు. ఇన్నాళ్లు నీళ్లు లేక అల్లాడిన ప్రాంతానికి సాగునీరు రానుండడంతో రైతులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు నేతృత్వంలో జిల్లా శాసనసభ్యులు, ఎంపీలు, పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు సభను విజయవంతం చేశారు. నారాయణఖేడ్ సహా అందోల్, సంగారెడ్డి, జహీరాబాద్, పటాన్చెరు నియోజకవర్గాల ప్రజలు భారీగా తరలివచ్చారు. హెలికాప్టర్లో సీఎం కేసీఆర్ 3.26 గంటలకు నారాయఖేడ్కు చేరుకున్నారు. మంత్రి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కలెక్టర్ స్వాగతం పలికారు. అనంతరం బసవేశ్వర, సంగమేశ్వర పథకాలకు శంకుస్థాన చేశారు. 3.46 గంటలకు సభవేదిక పైకి చేరుకున్నారు. 4.09 నుంచి 4.30 గంటల వరకు ప్రసంగించారు. ప్రజలు ఈలలు, హర్షద్వానాలతో సభ మార్మోగింది. గ్రామాలు, తండాల నుంచి బ్యాండ్ మేళాలతో, గులాబీ జెండాలు పట్టుకుని, నృత్యాలు చేస్తూ ఊరేగింపుగా కార్యకర్తలు, నాయకులు తరలివచ్చారు.
జనసంద్రమా.. గులాబీ వనమా..?
సీఎం కేసీఆర్ బహిరంగసభకు నారాయణఖేడ్, అందోల్, జహీరాబాద్, సంగారెడ్డి నియోజకవర్గాల్లో నుంచి జనం ఇసుకేస్తే రాలనంతగా తరలివచ్చారు. అది జనసంద్రంలా తలిపించింది. సీఎం మాటలు వినేందుకు వృద్ధులు, మహిళలు, యువకులు తండోపతండాలుగా తరలివచ్చి కేసీఆర్‌పై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. కంగ్టి, కల్హేర్, మనూరు, నాగల్గిద్ద, నారాయణఖేడ్ మండలాలతో పాటు జహీరాబాద్, సంగారెడ్డి, అందోల్, పటాన్చెరువు, కామారెడ్డి జిల్లాలోని జుక్కల్ నియోజకవర్గానికి చెందిన ప్రజలు భారీగా తరిలివచ్చారు. సభా ప్రాంగణానికి ప్రజలు వస్తున్న క్రమంలో బ్యాండు మేళాలు, నృత్యాలతో సందడి చేశారు.