TSUTF | వెల్దండ, జులై 2 : 2024 మార్చి నుండి ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ప్రభుత్వం చెల్లించాల్సిన పదవీ విరమణ అనంతర ప్రయోజనాలను వెంటనే విడుదల చేయాలని టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి డిమాండ్ చేశారు. టీఎస్‌యూటీఎఫ్ సీనియర్ నాయకులు, వెల్దండ హైస్కూలు తెలుగు ఉపాధ్యాయుడు మసనం యాదగిరి ఉద్యోగ విరమణ సందర్భంగా బుధవారం వెల్దండలో ప్రధానోపాధ్యాయులు ఆర్. రవీందర్ అధ్యక్షతన నిర్వహించిన వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో చావ రవి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
ఉద్యోగ, ఉపాధ్యాయుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, సమస్యలు పరిష్కరించకుంటే పోరాటాలకు ఉపాధ్యాయ, ఉద్యోగులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ప్రతీ నెలా రూ. 700 కోట్ల బకాయిలు విడుదల చేయాలని నిర్ణయించామని చెప్పారు. కానీ గత నెల రూ .180 కోట్లు మాత్రమే విడుదల చేశారు. నిర్ణయించిన ప్రకారం బకాయిలు విడుదల చేయాలని, పీఆర్సీ అమలు గడువు దాటి రెండు సంవత్సరాలు గడిచినందున వెంటనే పీఆర్సీ అమలు చేయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగం ప్రమాదంలో ఉందని, ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల సంఖ్య గణనీయంగా తగ్గిందని, ప్రభుత్వ పాఠశాలల పట్ల తల్లిదండ్రుల్లో విశ్వాసం కలిగించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని , ఊరి బడిని కాపాడుకోవాల్సిన అవసరం సమాజానికి ఉందన్నారు. యాదగిరి లాంటి అంకితభావం కలిగిన ఉపాధ్యాయులను ఆదర్శంగా తీసుకుని నూతన ఉపాధ్యాయులు పనిచేయాలన్నారు.
ఈ సమావేశంలో టీఎస్‌యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఆర్ కృష్ణ, రాష్ట్ర కమిటీ సభ్యులు ఎ చిన్నయ్య, ఉమ్మడి పాలమూరు జిల్లా యూటీఎఫ్ పూర్వ అధ్యక్షులు ఎపి మల్లయ్య,జిల్లా కోశాధికారి బాల్ రాజ్,జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ నెహ్రూ ప్రసాద్,మండల విద్యాధికారి ఎస్. చంద్రుడు గారు, మండల అధ్యక్షులు శ్రీకాంత్, సీనియర్ బాధ్యులు ఆర్. లక్ష్మణ్, చంద్రశేఖర్, నీరటి జైపాల్, మండల కోశాధికారి కె. వెంకటయ్య పాల్గొన్నారు. రాజస్వ ప్రధానోపాధ్యాయులు కె. శ్రీనివాసులు, వి. అంజయ్య, కె. శ్రీనివాసులు, మండల పూర్వ అధ్యక్షుడు నాగభూషణం, మండల పూర్వ ప్రధాన కార్యదర్శి బి. రవి, పుష్పలత, గంగా భవాని, సాజిదా తదితరులు పాల్గొన్నారు.
SIGACHI | మృతుల కుటుంబాలకు రూ. కోటి చొప్పున పరిహారం.. సిగాచీ పరిశ్రమ ప్రకటన
Phoenix Movie | ఈ సినిమాకు ముందు 120 కిలోలున్నా : విజయ్ సేతుపతి కుమారుడు సూర్య